Sunday 14 September 2014

అష్టమ వార్షికోత్సవ శుభవేళ




 ఈ రోజు మంచి రోజు.. మరపురానిది.. మధురమైనది... సినిమా పాట కాదండి. ఈరోజే నేను బ్లాగు మొదలెట్టినరోజు అందుకే  ఈ సంబరం..

వినడానికి వింతగా ఉన్నా నాకు మాత్రం అన్ని పండగలకంటే నేను పుట్టిన రోజు, నా బ్లాగు పుట్టినరోజు చాలా ముఖ్యమైనవి, ఇష్టమైనవి కూడా.. జీవితంలో ప్రతీ సంవత్సరం పెరుగుతూ, ఎదుగుతూ,  నేర్చుకుంటూ, నేర్పిస్తూ, ఆటుపోట్లను, అపజయాలు, అవమానాలను తట్టుకుంటూ,  విజయాలను సొంతం చేసుకుంటూ ఒక సంతృప్తి, గుర్తింపును తెచ్చుకున్నాను. అదే విధంగా జీవితపు రెండవ అంకంలో పిల్లలకోసం మొదలెట్టిన ఈ సాంకేతిక ప్రయాణం నాకు సాహితీపరంగా మరో జన్మ అని చెప్పవచ్చు. మొదటి అంకం నా కుటుంబానికి కేటాయించి విజయాన్ని సాధిస్తే, రెండవ అంకంలో నాకోసం కేటాయించుకుని అందుబాటులోకి వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకుని,  రాదు అని కాకుండా ఎందుకు రాదు అని మావారు చెప్పిన పాఠాన్ని అనుక్షణం గుర్తు చేసుకుంటూ.  నిజజీవితంలోనూ, ఈ మిధ్యాజీవితంలోనూ అనుక్షణం ఒక విద్యార్థిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాను. ఈ ప్రయాణం అంత సులువు కాదూ, సాఫీగానూ లేదూ. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ బ్లాగర్ గా,  రచయిత్రిగా, సంపాదకురాలిగా,  ప్రచురణకర్తగా ఒక్కో పాత్రని విజయవంతంగా నిర్వహిస్తూ వచ్చాను. ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ గుర్తింపు, విజయం ఒక పబ్లిషర్‌గా దక్కింది. ఈ సంవత్సరం జనవరి మొదటి తారీఖున మొదలెట్టిన ఈ J.V.Publisher నా పుస్తకం "తెలంగాణ వంటలు - వెజ్" తో మొదలెట్టి ఇప్పటివరకు పది పుస్తకాల ప్రచురణ  విజయవంతంగా సంతృప్తికరంగా పూర్తిచేయడం నా అదృష్టం అని భావిస్తున్నాను. అన్నిటికంటే గొప్పది.. ఒక చాలెంజ్ లా చేసింది సి.ఉమాదేవిగారి ఆరు పుస్తకాలు ప్రచురించడం.. అదే విధంగా మాలిక పత్రిక ముఖ్య సంపాదకురాలిగా మరో గొప్ప బాధ్యత కూడా నాకు సాహిత్య పరంగా ఎంతో సంతోషాన్నిస్తుంది. ఈ పత్రిక ద్వారా వివిధ ప్రక్రియలు, ప్రయోగాలను చేయడం కొత్త శక్తినిస్తుంది.

అందరికంటే ఎక్కువగా, ఎప్పటికీ  నేను ధాంక్స్ చెప్పుకోవాల్సింది నా బ్లాగు జ్యోతికే. నన్ను నేను పరిశీలించుకుని, విమర్శించుకుని, విశ్లేషించుకునేలా చేసి ఆ భావాలను అక్షరాలలో నిక్షిప్తం చేసుకునేలా చేసింది. ఎన్నో అందమైన భావాలకు నిలయమైంది. వివిధ సందర్భాలలో నా సంఘర్షణ, నా స్పందన అన్నీ తనలో దాచుకుంది. అప్పుడప్పుడు నాలోని వేదనకు, ప్రశ్నలకు చర్చావేదికగా మారింది.. నాకు నచ్చిన పాటలతో సరాగాలాడింది. అందుకే నిరంతరం నన్ను నేను నా బ్లాగులో చూసుకుంటూ ఉంటాను.... కాని ఈ మధ్య బ్లాగులో ఎక్కువ రాయడం కుదరడం లేదు.. ప్చ్...

అదేంటోగాని నా మీద నాకంటే నా మేలు కోరే మిత్రులకు ఎంతో నమ్మకం.. ఈ విజయాలన్నీ సాధించడానికి ప్రియమిత్రులు, శ్రేయోభిలాషుల తోడ్పాటు ఎంతో ఉంది... వారి సహకారం ఎన్నటికీ మరువలేనిది.  నా ఈ సాంకేతిక జీవన ప్రస్ధానంలో నన్ను గౌరవించి, ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ మనఃపూర్వక ధన్యవాదాలతో, ఒక గృహిణిని పబ్లిషర్ గా మార్చి,  విజయవంతంగా ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని బ్లాగురచనలో మరో వత్సరంలోకి అడుగిడుతున్న "జ్యోతి"కి అభినందనలు ....  మీ ఆశీర్వాదాలు కూడా కోరుకుంటూ...

గత వార్షికోత్సవాల విశేషాలు:


పంచమ వార్షికోత్సవం

5 వ్యాఖ్యలు:

Dantuluri Kishore Varma

అభినందనలు :)

Sharma


" దిన దిన ప్రవర్ధమానమవుతూ నీ బాధ్యతల నిర్వహణలో చక్కగా వున్న మా(లిక) జ్యోతి , కలకాలం సుఖ సంతోషాలతో , పేరు ప్రఖ్యాతులతో వర్ధిల్లాలని మనసారా దీవిస్తున్నా ."

Zilebi


జ్యోతి వలబోజు గారు

ఈ మధ్య వార్షికోత్సవ టపాల ద్వారా మాత్రమె దర్శనమిస్తున్నట్టు ఉన్నారు !! జేకే !!

శుభాకాంక్షల తో
జిలేబి

జ్యోతి

వర్మగారు, శర్మగారు ధన్యవాదాలు

జిలేబీగారు. నిజమేనండి. ఈ మధ్య ఎక్కువగా ఫేస్ బుక్ కి అలవాటు పడిపోయాను. బ్లాగుల్లో కూడా అంతగా సందడి కనపడటం లేదు. రాయడం తగ్గింది.. ధాంక్ యూ..

Blogger

మీరు మళ్ళా బ్లాగుల్లో కనబడాలని కోరుకుంటూ .. శుభాకాంక్షలు

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008