ఎప్పటినుండో ఈ విషయాలు నా మనసులో ఉన్నాయి. ఎదో నా మానాన నేను టైం దొరికినపుడు ఏవో పిచ్చిరాతలు బ్లాగులో రాసుకుంటున్నాను. అలాగే మిగతా బ్లాగులు , సైట్లు చదువుతున్నాను. ఈ మధ్య ఒక విషయంపై మాత్రం నాకు చాలా ఆరోపణలు ఉన్నాయి. అదేంటంటే.. పుస్తకాలు. సరేలే ఈ బాధ నాకొక్కదానికేనేమో. అందరూ హాయిగా ఉన్నారు. ఎన్నెన్ని పుస్తకాలు చదువుతున్నారో? వాళ్ళంతా గొప్పవాళ్ళు. మనకంత సీను లేదూ, సినిమా లేదు. అని ఊరుకున్నా.
పుస్తకాలంటే నాకు చిన్నప్పటినుండి ఇష్టమే. క్లాసు పుస్తకాలతో పాటు చందమామ, బొమ్మరిల్లు, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, యువ మొదలైన పుస్తకాలు కూడా చదివేదాన్ని. దాదాపు ముప్పై ఏళ్ల నుండి దాచుకున్న పుస్తకాలు, కటింగ్స్ తో బైండింగ్ చేయించుకున్న సీరియల్లు, నవలలు ఎన్నో మావారి సాధింపులు భరించలేక ఇచ్చేసానా. మరి ఏంటి గొడవ అంటారా? ఈ మధ్య బ్లాగుల్లో ఎక్కడ చూసిన పుస్తకాల కబుర్లే కన్పిస్తున్నాయి. అయినా అతి కష్టం మీద వాటి వైపు వెళ్ళకుండా ఊరుకుంటున్నా. కాని ఇవాళ మాలతి గారి టపా చదివాక ఇక నా ఆవేశం, ఆక్రోశం, అసూయ అన్ని అలా బయటకు వచ్చేసాయి. మాలతిగారి లాగే నాకు ఎన్నో సందేహాలు. అసలు వీళ్ళు ఇన్నేసి పుస్తకాలు ఎలా చదువుతారు ? అంత టైం ఎక్కడుంటుంది అస్సలు. కట్టలు , కట్టలు పుస్తకాలు చదివేసాం అంటారు. వీళ్ళు రిటైరయి ఖాళీగా ఉన్నారా అంటే అదీ లేదు. ఎపుడూ బిజీ ...బిజీ.. నాకు పెద్ద సందేహం. వాళ్లకు కూడా ఇరవైనాలుగు గంటలే ఉంటాయి కదా. ఎలా చదువుతారబ్బా. ఊరికే చదవడం కాదు. ఆ పుస్తకం చేతిలో పట్టుకుని ఆ కథలో దూరిపోయి తర్వాత తీరిగ్గా విశ్లేషిస్తారు. అది పుస్తకం వాళ్ళు అచ్చేస్తారు. అమావాస్యకు పున్నానికి ఒకటి ఐతే పర్లేదు... ఇక ఈ మధ్య ఏడాది మొత్తంలో చదివిన పుస్తకాల గురించి రాయమంటున్నారు. అవిడియా బావుంది. ఎదో లే ఎవరైనా ఏడాదికి నాలుగైదు పుస్తకాలు చదివి ఉంటారు అనుకున్నా. అయ్యా బాబోయ్. జంపాల చౌదరిగారి లిస్టు చూసి కళ్ళు బైర్లు కమ్మాయి. గిర్రున తిరిగినట్టైంది. (సినిమాల్లో కొత్తగా పెళ్ళైన అమ్మాయికి తిరుగుతాయి చూడండి అలా. అందులో ఐతే డాక్టరు కాని ఇంట్లో పెద్దవాళ్ళు కాని అమ్మాయి నాడి పట్టుకుని కంగ్రాట్స్ .. తల్లి కాబోతుంది అంటారు. మరీ సూపర్ కదా).. ఆ లిస్టు లో ఉన్నవన్నీ ఎక్కువగా ఇంగ్లీష్ పుస్తకాలే. అసలు ఆ ఇంగ్లీషు పుస్తకాలంటేనే మనకు పడదు. ఇంతింత లావుగా ఉంటాయి.ఎలా చదువుతారబ్బా??క్లాసు పుస్తకాలకంటే సీరియస్సుగా చదివితేగాని కథ అర్ధం కాదు. అలా అని నేను చదివానని మోసపోకండి. అంత ఓపిక లేదు. నాకు ఇప్పటికీ ఇష్టమైనవి అమర్ చిత్ర కథ, టిన్ టిన్ , ఫాంటమ్, మెండ్రేక్ .. అదే తెలుగు నవల ఐతేనా .. అది పూర్తి చేసేవరకు నిద్ర పట్టదుగా. వంట చేస్తున్నపుడు కూడా పుస్తకం పట్టుకుని పూర్తి చేసిన రోజులున్నాయి. అవన్నీ యద్దనపూడి, మాదిరెడ్డి, కోడూరి కౌసల్య రాజ్యమేలిన రోజులు లెండి.
పుస్తకం వాళ్ళు మాత్రమే కాదు ఇలా పుస్తకాల ???? చాల మంది గురించి (ఎంత కుళ్ళు, అసూయ ఉన్నా వీళ్ళని రాక్షసులు, దుర్మార్గులు అంతే బాగోదు కదండీ. పొద్దున్న లేస్తే మొహాలు చూసుకునే వాళ్ళం) మీరు చదివారా? అంటూ వచ్చిన ఎన్నో ఇంటర్వ్యూలలో .. అమ్మో . ఎన్నెన్ని పుస్తకాలు ? అయినా వేలకొద్ది పుస్తకాలు ఏం చేసుకుంటారో ? ఏమో? ఇలా వేల కొద్ది పుస్తకాలు కొనేవాళ్ళ గురించి నాదో పెద్ద డౌటు? ఈ చుట్టుపక్కల ఆదాయం పన్ను శాఖ వాళ్ళు లేరు కదా? ఉంటే గింటే వాళ్ళని పక్కకి తోలండి.. నేను అనుకునేదేంటంటే... వీళ్ళందరికీ జీతం కంటే గీతం ఎక్కువని. అందుకే అన్ని పుస్తకాలు అలా కూరగాయలు కొన్నంత ఈజీగా కొనేస్తారు. ఈ బ్లాగులో , సైట్లలో వచ్చిన సమీక్షలు చూసి కొన్ని పుస్తకాలు కొందామనుకున్నా. మంచి చీర కొనుక్కుందామని కంది పప్పు (బ్యాంకు లాకర్ కంటే ఇదే సేఫ్, కాస్ట్లీ కదా) డబ్బాలో, బండి మీద కొన్న కూరగాయలను సూపర్ మార్కెట్ ధరలు చెప్పి మిగిల్చిన డబ్బులు, అలా ఇలా పోగేసిన డబ్బంతా పెట్టి పుస్తకాలు కొంటెే చిన్న క్యారీబ్యాగ్లో వచ్చాయి మరి. నేను అలా అనుకోవడంలో తప్పేంటి?
ఇదంతా కాదు కాని.. మాలతిగారు అన్నట్టు చెట్లను సంరక్షించడానికి పుస్తకాలు చదవడం , రాయడం నియంత్రిస్తే మంచిదే.. కాని దీనికి అందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఎదోఒకటి చేయాలి తప్పదు. అందుకే ఈ JAC .. ఇపుడు ఎక్కడ చూసిన ఇదే మాట వినిపిస్తుంది కదా. నేను అలాగే డిసైడ్ ఐపోయా. ఇందులో చేరి ఊరికే మాటలతో కాలయాపన చేయకుండా, తక్షణమే రంగంలోకి దిగాలి. నా అవిడియాలు ఏంటంటే.. ( బోల్డు పుస్తకాలు సేకరించి పెట్టుకున్నవాళ్ళు జాగ్రత్త ) అమాయకంగా మేము అది చదివాం, ఇది చదివాం. నా దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలుసా అని చెప్తున్తారుగా. వాళ్ళ ఊర్లో ఉన్న సంఘ సభ్యులు గుట్టు చప్పుడు కాకుండా ఆ ఇంటిపై దాడి చేసి పావు వంతు పుస్తకాలు వదలేసి మిగతావి ఎత్తుకొచ్చెేయాలి. వాటిని మిగతా సభ్యులకు పోస్ట్ చేయాలి. అలా అవి అందరు చదివాక రూపు రేఖలు బాగుంటే తిరిగిచ్చేస్తే సరి.. వేరే దారి లేదు. అన్ని పుస్తకాలు కొనాలంటే అందరివల్ల అవుతుందా. సమీక్షలు రాసి మిగతావారి బుర్రలు పాడు చేసేవారిని నెలకొకసారి రాసేలా నియంత్రిస్తే ఎలా ఉంటుంది. గుడ్డిలో మెల్ల మేలు కదా ?
అసలైతే ఈ టపాలు చదివి . ఎవరెవరంటారా?? కొత్తపాళీ, నాగరాజు పప్పు, మురళి, కస్తూరి మురళీకృష్ణ,,కల్పన, సుజాత, లలిత,,,, చావా కిరణ్ .. ఇంకా చాలా మంది ఉన్నారు. అలనాడు ప్రవరాఖ్యుడు కాళ్ళకు ఎదో క్రీమ్ పూసుకుని అలా ఎగిరిపోయాడు కదా. అలా వెళ్ళిపోయి నాకు కావలసిన పుస్తకం తెచ్చేసుకుని చదువుకుంటే ఎంత బాగుండు అనుకుంటా? అలా అని నేను పుస్తకాలన్నీ బేవార్సుగా చదవాలనుకుంటాను అనుకోవద్దు. నేను కొంటూనే ఉన్నా. అయినా రోజు ఎదో ఒక పుస్తకం బావుంది అని చెప్తుంటే దురాశ కలగదా?
సరే ఇక ఎవరెవరు JAC లో చేరతారో చెప్పండి....