Monday, 31 March 2008

గోవిందా గోవిందా ....


సత్యసాయిగారు , వాళ్ళమ్మాయి శ్రావ్య రాసిన టపాలు చదివి నా తిరుపతి ప్రయాణ విశేషాలు రాయకుండా ఉండలేకపోతున్నాను. మాకు పాతికేళ్ళ నుండి ప్రతి సంవత్సరం తిరుపతి కి వెళ్ళే అలవాటు ఉంది. అలా అయినా కాస్త విహార యాత్ర లాగా ఉండేది. తిరుపతి నుండి మరి కొన్ని ప్రదేశాలు కూడా వెళ్ళే వాళ్ళం.

అప్పట్లో తిరుపతి ప్రయాణం అంటే ఒక గొప్ప అనుభూతి ఉండేది. దాని కోసం ఎన్నో రోజుల నుండి ప్రయాణ సన్నాహాలు, టికెట్లు బుకింగ్ , తిను బండారాలు చేసుకోవడం. కాని మేము ప్రతీ సారి దాదాపు పది రోజుల పైనే ప్రయాణం పెట్టుకునేవాళ్ళం అదీ చిన్నపిల్లలతో. హోటల్ తిండి తింటూ అన్ని రోజులు ప్రయాణం సాధ్యమా. కాని మేము మాత్రం స్వయం పాకమే. వంట చేసుకుంటూ అన్ని ప్రదేశాలు తిరిగేవాళ్ళం. రెండు బ్యాగులు ఎక్కువ అయ్యేవి. కాని మంచి భోజనం లేకుంటే ఇంకేం తిరుగుతాం. ఎప్పుడు కూడా మాతో పాటు ఇంకో కుటుంబాన్ని తీసికెళ్ళేవాళ్ళం ఇక ఫుల్ ఎంజాయ్. దాదాపు పదేళ్ళ క్రింద తిరుమలలో దర్శనం చాలా బాగా జరిగేది. మేము ఎక్కువగా డిసెంబరు నెలలో వెళ్ళేవాళ్ళం. చలికాలం కదా జనాలుటక్కువగా ఉంటారు , దర్శనం ఈజీగా చేసుకోవచ్చని. రాత్రి భోజనం చేసి క్యూ కాంప్లెక్స్ లో కెళ్ళి లోపలికి ఒకటే పరుగులు .లైన్లో నిలబడే ప్రసక్తే లేదు. అంత చలిలో ఎక్కువమంది ఉండేవారు కాదు హాయిగా అరగంటలో తీరిగ్గా స్వామి దర్శనం చేసుకుని బయటపడేవాళ్ళం. సుప్రభాత సేవ ఐతే లోపల ఎక్కువ సేపు స్వామిని చూడవచ్చు అని ఆ టికెట్ తీసుకునేవాళ్ళం ఎక్కువగా. ఒకసారి అర్చన కోసం కూర్చుంటే రెండు గంటలు పైగా జరిగింది. పిల్లలైతే పడుకున్నారు. నేను కొద్ది సేపు కూర్చోవడం , కొద్ది సేపు నిలబడి స్వామిని చూడడం. అంత తీరిగ్గా స్వామిని చూసే అదృష్టం ఉండేది అప్పట్లో. ఇక కల్యాణం చేయిస్తే చెప్పొద్దూ కాని చాలా విసుగోచ్చేది. అంత సేపు జరిగేది.తర్వాత ఇచ్చే ప్రసాదాలు ఇక చెప్పనక్కరలేదు. ఇరవై పెద్ద లడ్డూలు, ఇరవై గారెలు, ఇరవై వడలు, అన్న ప్రసాదాలు ( పులిహోర, చక్రపొంగలి, దధ్యోజనం, పొంగలి) ఇలా ఇచ్చేవారు. ఆ సువాసనలు ఇప్పుడేవి...అలా నింపాదిగా స్వామిని చూసే అదృష్టం కోసం ఎన్ని కష్టాలైనా పడొచ్చు అనిపించేది. ఎన్.టి.ఆర్ కాలంలో ఐతే అక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉండేది. ముఖ్యంగా అప్పటి E.O ఫై.వి.ఆర్. కే ప్రసాద్ గారు తిరుమలలో అవినీతి అనేది మచ్చుకైనా కనపడకుండా ప్రయత్నించారు. మహానుభావుడు.

మరి ఇప్పుడు తిరుమల అంటే అవినీతి సామ్రాజ్యం ఐపొయింది. అక్కడికి వెళ్ళాలంటే భక్తి కంటే నోట్ల కట్టలు, సిఫారసులు కావాలి. సరే అలా ఖర్చు పెట్టి వెళ్ళినా దేవుడిని కనీసం ఒక్క నిమిషం కూడా చూడనివ్వరు.మొదటి ద్వారం దగ్గరనుండే పదండి పదండి అంటూ తోసేయడమే. దేవుడి ముందున్న పంతులుకు యాభై నోటు వాసన చూపిస్తే ఒ రెండు నిమిషాలు నిలబడనిస్తాడు అదే భాగ్యం అనుకోవాలి. కలికాలం అంటే ఇదే మరి. దేవుడి పేరు చెప్పి దోచుకుంటున్నారు. బయటకోచ్చాక తీర్థం ఇచ్చే పంతులు ఒక చేత్తో శఠ గోపం పెడుతూ మరో చేయి చాచి ఉంచుతాడు. భక్తులు డబ్బులు వేయగానే రొంటిలో దోపుకోవడం. ఇదీ తంతు. కళ్యాణం ఐతే మరీ మొక్కుబడిగా చేస్తున్నారు. సంకల్ప చెప్పడానికి దంపతులు వెళ్లి రావడానికి అరగంట. అసలు కళ్యాణం జరిగేది అరగంట. ఆశీర్వాదం తీసుకోవడానికి మరో అరగంట. అంతే . అక్కడ పంతులుకు నోటు సమర్పిస్తే ఓ నిమిషం ఎక్కువ నిలబడోచ్చు. దిగిన తర్వాత టిటిడి లో పని చేసే జవానుకు మరో నోటు ఇస్తే కాసింత చందనం తెచ్చి ఇస్తాడు. ఇదీ తంతు. రెండు లడ్డులు, రెండు గారెలు ఉన్నా కవర్ మన మొహాన పడేసి , తాంబూలాలిచ్చేసాం ఇక తన్నుకు చావండి అన్నట్టు పూజారులు అన్ని సర్దుకుని వెళ్ళిపోతారు. ఇక భక్తులు అందరు దర్శనం కోసం పరుగులు. దర్శనం చేసుకుని బయటకొచ్చాక పంతుళ్ళు మన వెంట పడతారు ఆశీర్వాదం ఇవ్వడానికి స్వామి వారి కల్యాణం చేయించారు అంటూ. వాళ్ళను తప్పించుకుని రావడం ఒక పెద్ద పని. ఇపుడు తిరుమలలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మొత్తం కమర్షియల్ . ఎవడు చూసిన భక్తులను దోచుకోవాలనుకునేవాడే. డబ్బున్నవాడిదేరాజ్యం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇన్ని కష్టాలుపడి వేంకటేశ్వరుడిని చూడాలని వెళ్తే లాభమేంటి ? కళ్ళారా చూడనీకుండా తోసేయడం. మరి ఎందుకు వెళ్ళడం??

అందుకే నాకు తిరుపతి వెళ్ళాలి అంటేనే విరక్తి కలిగింది. మా ఇంటికి దగ్గరలో ఉన్న వేంకటేశ్వరుడిని మనస్పూర్తిగా , నిదానంగా , కళ్ళారా చూసుకోవచ్చు. అక్కడా ఇక్కడా ఉన్నది ఆ దేవ దేవుడే అని నిర్ణయించేసుకున్నా.. ఐదేళ్ళ వరకు తిరుమల దేవుడికి అభిషేకం చేయించే టికెట్లు లేవంట. కాని ఇచ్చేవాళ్ళకు అవి ఇస్తారులెండి అది వేరే సంగతీ. కాని ఇక్కడ ఒకరోజు ముందు తీసుకుంటే సరి. కళ్యాణము . అంతే.

ఇందు గలడందు లేడను సందేహము వలదు . చక్రి సర్వోపగతుండు. అని నా మనస్సుకు చెప్పెసుకున్నా. మావారికి కూడా చెప్పాను. నేను ఆ తిరుపతికి ఇప్పట్లో రాను అని. భగవంతుడా నిన్ను నువ్వే కాపాడుకోవాలి ఇక . అలాగె మీ ఆవిడని, అన్నగారిని కూడా. గుడిని గుళ్ళో దేవుడిని కూడా అమ్ముకునే మనుషులున్న కలికాలం ఇది.

Friday, 28 March 2008

వ్యామోహానికి అధారం అహంకారం....

"నేను" ఎవరైనా తమ గురించి చెప్పుకునేటప్పుడు చాలా ఉత్సాహంగా ప్రతీ వాక్యంలోనూ ప్రస్తావించే పదం ఇది. వయసు పెరిగే కొద్దీ, అనుభవాలు గడించేకొద్దీ, సంపాదన, సర్కిల్ పెరిగేకొద్దీ "నేను" అనే భావనకు ప్రతి వ్యక్తి అత్యంత ప్రాముఖ్యత ఇస్తుంటారు. తనకంటూ ఓ ప్రత్యేకతను ఆపాదించుకుంటూ అది నిరంతరం చెక్కుచెదరకుండా కాపాడుకోవడంలోనే చాలామంది జీవితాలు తెల్లారుతూ ఉంటాయి. పుట్టేటప్పుడు ఏమీ కాని తను, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోని తను మధ్యలో తాను పాత్రల్లా పోషించే హోదాలపై మమకారం పంచుకుంటూ తాను పోషించే హోదాలపై మమకారం పెంచుకుంటూ తాను పోషించే విభిన్న పాత్రలే తాననుకుంటూ ఓ రకమైన మాయలో కూరుకుపోవడం జరుగుతుంది.


చాలామంది ఇప్పటికీ తమ హోదాలను ఆసారాగా చేసుకుని డాబూ దర్పం ఒలకపోస్తే తప్ప మానసిక తృప్తి పొందనంతగా ఆయా పాత్రల్లో మమేకం అయిపోతున్నారంటే తమ నుండి తామూ విడిపడి ఎంత దూరం తాము పోషించే పాత్రల్లో లీనమై పయనిస్తున్నారో అర్ధమవుతుంది. "నేను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని ... నేను ఎడిటర్ ని .. నేను కన్సల్టెంట్ ని.. " అంటూ మన గురించి మనం చెప్పుకునేటప్పుడు కూడా అందులో మనం పోషించే పాత్ర పట్ల అటాచ్ మెంట్ స్పష్టంగా కన్పిస్తుంది. ఇలా నేను (అహం ) అనే భావనకు.. నేను ఫలానా (ఆకారం) అనే తత్త్వం ఆపాదించుకుని అహంకారం పెంచుకుంటున్నాం. నేను అనే తత్వానికీ .. మనం ఏదైతే మనం అని అనుకుంటున్నామో ఆ ఆకారానికి ఎవరు ఎ రూపంలో బురద జల్లడానికి ప్రయత్నించినా అహంకారం దెబ్బ తింటుంది. మనసు జీర్ణించుకోదు . మనం మనది అనుకుంటున్న శరీరమే మూడుపూట్లా తిండి పెడితే కానీ, సరైన విశ్రాంతి తీసుకుంటే కానీ మన మాట వినదే ! ఇలా నిరంతరం అద్దె చెల్లిస్తూ పోషిస్తున్న మన శరీరమే అద్దె కొంప అయినప్పుడు మనం "నేను ఫలానా" అని విర్రవీగుతున్న హొదాలన్నీ ఎంత ఆధారరహితమైనవో కదా! నిన్న లేనిదీ రేపు లేనిదీ ఈ రోజు మాత్రమే ఉన్నదాన్నే మాయ అంటారు. ఎంత ప్రయత్నించినా ఈ మాయలో పడకుండా ఎవరూ ఉండలేరు.


ఇది వేదాంతము కాదు. అక్షర సత్యం. ప్రాక్టికల్ గా పరిశీలించి చూడాలంటే మీరు ఉద్యోగిగా, భర్తగా, భార్యగా, అన్నగా, చెల్లిగా, తల్లిగా, తండ్రిగా ఈరోజు మనం పోషిస్తున్న విభిన్న పాత్రల నుండి విడిపడి చూస్తే ఆ ఒంటరితనాన్ని మనం భరించగలమేమో చూడండి. భరించలేం! కారణం మనం మనం పోషించే పాత్రల పట్ల అంత అటాచ్ మెంట్ సృష్టించుకుంటున్నాము. అలాగే ఆ పాత్రలను ఆధారంగా చేసుకుని మనకంటూ మనం ఓ ప్రత్యేక వ్యక్తులుగా ముద్రని వేసుకుంటున్నాము . చాలామంది అహంకారం అంటే బయటకు ప్రకటించేదే అనుకుంటారు. మనం బయటకు ప్రకటించకుండానే మనలో లోలోన పెరుకుపోతున్న ఈ తరహా అహంకారాన్ని అధిగామించకపోతే జీవితం పట్ల వ్యామోహం పెరిగిపోతుంది.

నల్లమోతు శ్రీధర్

Thursday, 27 March 2008

సెల్లాయనమః






ఈ రోజు 27.3.08 ఆంధ్ర జ్యోతి దినపత్రికలో వచ్చిన వ్యాసం.

సెల్లాయనమ




పూర్వం సెల్వమణి అనే ఒక భక్తుడు శ్రీమహావిష్ణువు గురించి ఘోరమైన తపస్సు చేసెను. అంతట శ్రీహరి ప్రత్యక్షమై " భక్తా! నీ తపమునకు సంతసించితిని. ఏదైనా వరము కోరుకొనుము'' అని చెప్పెను. అప్పుడు అతగాడు " దేవా! నాకు ఎటువంటి మోహము లేదు. సదా నీ హృదయ పీఠముపై నిలచి ఉండేలా వరమివ్వు'' అన్నాడు. అప్పుడు విష్ణువు " భక్తా! నా హృదయ పీఠం ఖాళీగా లేదు కదా. అది నా సహచరి మహాలక్ష్మి నివాస పీఠమాయె. వేరే ఏదైనా వరం కోరుకొనుము'' అనెను. అప్పుడు సెల్వమణి " స్వామి! నారాయణుడి హృదయస్థానము కాకున్నను, కనీసం నరుని హృదయ స్థానముపై ఉండే వరమునిమ్ము'' అని కోరాడు.

" అటులనే భక్తా! కలియుగములో నరుడు తన అపార మేధా సంపత్తితో ఒక మాటాడు యంత్రమును కనుగొని, దానికి సెల్‌ఫోన్‌ అని నామకరణము చేసి అది ఎల్లప్పుడు తన హృదయమునకు దగ్గరగా జేబులో ఉంచుకొనును. అది నువ్వే కనక అప్పటినుండి నీకు నరుని హృదయపీఠముపై స్థానం లభించును'' అని వరమిచ్చాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఆ తర్వాత కథ అందరికీ తెలిసిందే. అయితే సెల్‌ఫోన్‌ కొన్నవాళ్లందరూ సెల్వమణిని ప్రార్థిస్తూ చేయాల్సిన వ్రతం ఒకటుంది. ప్రతి ఒక్కరు కొత్త సెల్‌ ఫోన్‌ కొన్నప్పుడు ఈ వ్రతం తప్పకుండా చేయాలి. ముందుగా ఒక పీటపై కొత్త గుడ్డ పరిచి వెండి పళ్లెంలో కొత్త సెల్లును ఉంచి మీ శక్తికొలది రీచార్జ్‌ కూపన్లు ఉంచి ఐదు రకాల పూలు, పండ్లు, ప్రసాదాలు పెట్టి పూజ చేయాలి. మొదట సంకల్పం చెప్పుకోండి ఇలా... ఓమ్‌! సెల్లాయనమః రింగ్‌ టోన్‌ ఘల్లాయనమః సెల్లుంటే థ్రిల్లాయనమః బిల్లు చూస్తే ఝల్లాయనమః అది కట్టేసరికి జేబుకు చిల్లాయనమః ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత మీ సెల్‌ఫోన్‌కు వైరస్‌ రాకుండా, దొంగలు ఎత్తుకుపోకుండా, రాంగ్‌ నెంబర్లు రాకుండా విఘ్నేశ్వర పూజ, నవగ్రహ పూజ శాస్త్రోక్తంగా జరిపించాలి. ఒక కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి.

ఆ తర్వాత ఈ సెల్‌ఫోన్‌ వ్రతం చేస్తానని లాభపడిన ఒక వ్యక్తి కథ తప్పనిసరిగా వినాలి. ( ఎక్కువ కథలైతే మీకు వినే ఓపిక ఉండదుగా అందుకే ఒక్కటి చాలు). ఈ వ్రతం చేసేవారు వ్రత విధానం పూర్తిగా పాటించాలి. లేకుంటే మీ సెల్‌ఫోన్‌ను ఎవరైనా ఎత్తుకుపోవచ్చు. సిమ్‌ మార్చి వాడుకోవచ్చు. మీకు నిత్యం ప్రకటనదారుల కాల్స్‌, మెసేజీలు రావొచ్చు లేదా మీ సెల్లును మీరే సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌లో కొనాల్సి రావొచ్చు. జాగ్రత్త మరి. ఒకానొక పట్టణములో కవిత అనే యువతి ఇంజనీరింగ్‌ చదువుతున్నది. ఎన్నిసార్లు అడిగినా ఆమె తండ్రి ఆమెకి సెల్‌ఫోన్‌ కొనివ్వలేదు. అది కొనిస్తే చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుందని. కవిత స్నేహితులందరికి సెల్‌ఫోన్‌ ఉంది. తనకే లేదని బెంగగా ఉండేది. పెంపుడు జంతువులు సైతం ఆమెను వెక్కిరించేవి. ఏం చేయాలో తోచని కవిత ఈ వ్రతం గురించి తెలుసుకుని "దేవుడా! త్వరగా నాకు సెల్‌ఫోన్‌ వచ్చేలా చూడు తండ్రీ. వెంటనే ఈ వ్రతం చేసుకుంటాను'' అని మొక్కుకుంది.
ఇది జరిగిన పది రోజులకే అమెరికాలో ఉన్న కవిత అన్నయ్య ఆమె పుట్టినరోజుకు కొత్త సెల్‌ఫోన్‌ పంపాడు. కొడుకు పంపాడని తండ్రి కూడా అభ్యంతరం చెప్పలేదు. సంతోషంతో కవిత ఒక హోటల్‌లో ఈ వ్రతాన్ని జరుపుకుంది మరికొందరు స్నేహితులను కూడా పిలిచి (ఎలాగూ వాళ్లకు పార్టీ ఇవ్వాలిగా ). కథ సమాప్తం. ఈ కథ విన్నవారికి సకల శుభములు చేకూరి సెల్‌ లేనివారికి కొత్త సెల్‌, ఉన్నవారికి మరొక సెల్‌ ప్రాప్తించును. చివరగా కొత్త సెల్లును ఒక వెండి పళ్ళెంలో ఉంచి భక్తితో కర్పూరం వెలిగించి దానికి శక్తి కొలదీ రీచార్జి కూపన్లను నైవేద్యముగా సమర్పించి ఆ సెల్లును తమ జేబులో పెట్టుకుని వచ్చినవారికి పండ్లతో పాటు రీచార్జి కూపన్లు వాయనమిచ్చినచో సకల ఐశ్వర్యములు సిద్దించును. మీ సెల్లు మూలంగా మీకు, ఇతరులకు కూడా ఎటువంటి సమస్యలు రాకుండా ఉండుగాక ! -జ్యోతి వలబోజు

Tuesday, 25 March 2008

శోభన్ బాబుకు అశృ నివాళి

ఒక సినిమా నటుడిగా కాకుండా మంచి ఆత్మీయ కుటుంబ మిత్రుడిగా శోభన్ బాబు గారికి నా అశ్రు నివాళి.

నవతరంగం లో

ఇదే పాట ప్రతీ చోట ఇలాగే పాడుతుంటాను.... పుట్టినిల్లు - మెట్టినిల్లు



అదిగో నవలోకం వెలసే మనకోసం.... వీరాభిన్యు

Sunday, 23 March 2008

వ్యక్తిత్వం

నాకు కలిగే ఎన్నో సందేహాలను తీర్చుకోవడానికి ఇలా ఒక్కోటి అడుగుతున్నాను.


ఒక వ్యక్తి యొక్క గుణగణాలు, స్వభావం, అతని పుట్టుకతో వస్తాయా, పెంపకం వల్లా, పెరుగుతున్నపుడు అతని చుట్టు ఉన్న పరిస్థితుల వల్లా???. అంటే సహాయ గుణం, అల్లరి, ఆత్మీయత మొదలైనవి. ఇవి నేర్చుకుంటే రావుగా ??

Saturday, 22 March 2008

వెలుగు వైపు పయనం

కాలమెప్పుడు మన పక్షానే ఉండదు. ప్రతీ జీవితంలోనూ కొన్ని గడ్డురోజులంటూ
రావడం ఖాయం ! ఎంత శ్రమించినా ఎదురుదెబ్బలు తగలడం, మన పరిధిలో
లేని, మనం నియంత్రించలేని అనేక అంశాలు మనల్ని శాసించడం సహజం.
ఓ అపజయమో, అనారోగ్యమో, నష్టమో, కష్టమో వచ్చిందంటే చాలు...
అప్పటివరకూ మనకి ఎంతో గౌరవం ఇచ్చిన సమాజం కూడా ప్రతీ చిన్న
విషయాన్నీ వేలెత్తి చూపడానికి ఉత్సుకత చూపిస్తుంది. అసలే నిండా
ఇబ్బందుల్లో ఉన్న మన ఆత్మస్థైర్యాన్ని సమాజంలోని వ్యక్తుల ప్రవర్తన
మరింత దెబ్బ తీస్తుంది. అంతటి క్లిష్టతర పరిస్థితుల్ని ఎదుర్కోవడం ప్రతి ఒక్కరి
వల్లా కాదు. కష్టాలన్నీ తాత్కాలికమేనని మన మనసుకి మనం సర్ది చెప్పుకుంటూ,
మరో ప్రక్క సమాజం చూపించే చులకన భావాన్ని తట్టుకుంటూ సమాజం
చులకనగా చూసినంత మాత్రాన మనం వైఫల్యం చెందలేదని మనో నిబ్బరంగా
నిరంతరం బేలన్స్ చేసుకోవడం ఎంతో కష్టమైన వ్యవహారం. ఏదీ శాశ్వతం కాదు.
కీర్తి ప్రతిష్టలు ఉన్నప్పుడు సమాజం చూపించిన గౌరవం, మనం సంపాదించిన
డబ్బు, అనుభవించిన భోగం.. కష్టాలతో వచ్చే నిష్టూరాలు, నష్టాలు, అశాంతి
అన్నీ జీవిత గమనంలో మజిలీలే ! భౌతికపరమైన అంశాలకు ఎప్పుడైతే
ప్రాధాన్యత తగ్గించి ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేస్తామో, ఆత్మశక్తి
అంటూ ప్రతీ శరీరంలోనూ ఒకటుంటుందని.. దానికి కలిగే ఆనందమే
సర్వోత్కృష్టమైనదని గ్రహించగలుగుతాం. అప్పుడు ప్రతీ కష్టాన్నీ, ఆనందాన్నీ
ఒకే రకమైన చిరుమందహాసంతో స్వీకరించగలుగుతాము.

నల్లమోతు శ్రీధర్

Friday, 21 March 2008

రంగుల పండగ రంగేలి ....

వసంతోత్సవ వేళ అందరికీ శుభాకాంక్షలు...



Send this eCard !

Wednesday, 19 March 2008

మాయా ప్రపంచం

మనస్సెంతో సున్నితమైనది. అనందమేసినపుడు ఉప్పొంగిపోతుంది. చీకటి

మబ్బులు కమ్ముకున్నప్పుడు కృంగిపోతుంది ! ఆశల రెక్కల్ని పురి విప్పి

గిలిగింతలు పెడుతుంటుంది.. నిరాశ ఎదురైనపుడు చిన్నబుచ్చుకుంటుంది.

ఆత్మీయుల పలకరింపులకు పులకరించి పోతుంది.. నిరాదరణ ఎదురైనపుడు

నియంత్రణ కోల్పోతుంది. ఆశయాల సాధనకై మార్గాన్వేషణ చేస్తుందిమార్గ

మధ్యంలో ముళ్ళెదురైతే మౌనంగా వెనుదిరుగుతుంది. . ప్రేమకై పరితపిస్తుంది. ..

ప్రేమానురాగాలను పదిలపరచుకోలేక ఆ ప్రేమబంధాలనే పరిత్యజిస్తుంది.

అందలాలు ఎక్కాలనుకుంటుంది. అందిందే దక్కుదలగా సరిపుచ్చుకుంటుంది.

స్నేహానికి ప్రాణమిస్తానని పరితపిస్తుంది. స్వార్ధపు పొరలు కమ్ముకున్నపుడు

అదే స్నేహన్ని కాలదన్నుకుంటుంది. మనిషి జీవితం క్షణభంగురమంటే

ఒప్పుకుంటుంది. మృత్యువు ముంగిట్లో ఉన్నప్పుడు ఒడిలోకి చేరడానికి

వెనుకాడుతుంది. కష్టాలొచ్చినప్పుడు కన్నీరు కారుస్తుంది. . ఇతరుల కష్టాలకు

మొసలి కన్నీరునే మిగుల్చుతుంది. ప్రపంచ శాంతిని కాంక్షిస్తుంది. . నిరంతరం

అశాంతితో అల్లాడుతుంది. మనసు చేసే గారడీలకి కట్టడిలొ ఉండలేక మనం

మాత్రం ఆ మాయాలోకపు మత్తులొ నిరంతరం మునిగిపోయే ఉంటాం

మాయ వీడి వాస్తవం కళ్ళెదుటే నిలిచేసరికి మరో మాయ కమ్మేస్తుంటుంది.

నల్లమోతు శ్రీధర్

ఒటేద్దామా !!!.........



ఆంధ్రదేశంలో ఎక్కడ చూసినా ఎన్నికలొచ్చేసాయని అన్ని పార్టీలు పాంట్లు, పంచెలు, చీరలు ఎగదోసి తమ దుమ్ము దులుపుకుని మనలందరిని మళ్ళీ టోపీ పెట్టడానికి ఓ గోల పెట్టేస్తున్నాయి. నాలుగేళ్ళనుండి ఏం చేసారో మరి.. ఇది పాత గోలే . అందరికి తెలిసిందే. కదా. మరి బ్లాగ్లోకంలో ఓటేయడమేంటీ? ఎంటా ఎన్నికలు అనుకుంటున్నారా! .. అబ్బే అ కంఫు ఇంకా మనలోకంలోకి రాలేదులెండి..


పత్రికలలో వస్తున్న వ్యాసాల పుణ్యమా అని, రోజు రోజుకు తెలుగు బ్లాగులు పెరిగిపోతున్నాయి బంగారం ధరల్లాగా . చదివేవారు పెరుగుతున్నారు. కాని వ్యాఖ్యలు రాసేవారు మాత్రం ఇప్పుడు సెన్సెక్స్ సూచి లా తగ్గిపోతున్నారు. బ్లాగులో టపా పేరు , దాని కథ ఓ నాలుగు లైన్లు కూడలిలో చూసి ఆ తోక పట్టుకుని ఆ బ్లాగుకెళ్ళి చదువుతున్నారు. చాలా సంతోషం. కాని ఇలా ఓ నాలుగైదు టపాలు చదివేసరికి ఉన్న ఓపిక మొత్తం హుష్ కాకి అవుతుంది. ఇక వ్యాఖ్యలు ఎలా రాస్తారు. పాత కాపులు(బ్లాగరులు ) అర్ధం చేసుకుంటారు. కాని కుర్ర బ్లాగర్ల (కొత్త బ్లాగర్లందరు కుర్రోళ్ళే, బ్లాగ్వయసులో) సంగతేంటీ? తెలుగు మీద ఉన్న అభిమానం, ప్రేమ తో బ్లాగు మొదలెట్టి టపా రాసి ఒక్క వ్యాఖ్యకాని, గుర్తింపు కాని రాకుంటే క్రుంగిపోతారు కదా. అసలు తను రాసింది ఎంతమంది చదివారు , ఎంతమందికి నచ్చింది , అసలు నచ్చిందా లేదా?, అని ప్రతి బ్లాగరుకు ఉంటుంది. కొందరు ఉద్ధండ బ్లాగ్పండితులు తప్ప.







ఒక వేళ మనము చదివిన టపాకు వ్యాఖ్య రాసే ఓపిక లేకున్నా, బద్ధకించినా కనీసం అది మనకు ఎంత నచ్చింది, దానికి ఎన్ని మార్కులు ఇవ్వొచ్చు అని ఓటు వేస్తే. కనీసం ఆ మార్కులు చూసి ఆ బ్లాగరు మొహం వెలిగిపోతుంది కదా.(అందులో నేను కూడా ఉన్నాను మరి). అందరు ఇచ్చిన ఆ మార్కుల ఆధారంగా ఆ టపా విలువ పెరగొచ్చు , తరగొచ్చు. ఈ మార్కుల ఆధారంగా ఏ టపా ఎక్కువ ఆదరణ పొందింది అని తెలుస్తుంది , వ్యాఖ్యలు రాకున్నా కూడా. భలే ఉంది కదా !.. సో అందరు.. టపా చదవండి. వ్యాఖ్య రాసే ఓపిక లేకుంటే, మీరు చదివిన టపా మీకు ఎంత నచ్చింది అని మార్కులేయండి ఆ చుక్కల్లో ఉన్న నంబరు ప్రకారంగా.


అస్సలు నచ్చలేదు, ఫర్వాలేదు, బాగుంది, చాలా బాగుంది, సూపర్ అదుర్స్.. ఇలా 1, 2, 3, 4, 5...






బ్లాగులో టపా రాయగానే నిమిషాల్లో కూడలిలో కనిపిస్తుంది. అది చూసి చదువరులు ఆ బ్లాగు టపా చదువుతారు . వెళ్ళిపోతారు. ఎప్పుడొ ఒకసారి వ్యాఖ్య రాస్తారు కొందరు. అలాగే ఎందరో రాసే టపాలతో మన టపా ఎక్కడికో వెళ్ళిపోతుంది. లేదా మనకు నచ్చిన బ్లాగు టపా తర్వాత ఎప్పుడన్నా చదవాలంటే ఎలా. ఫలానా టపా బాగుండింది. మళ్ళీ చదువుదామంటే ఒక్కోసారి ఆ బ్లాగు చిరునామా కూడా గుర్తుండదు. ఇలాటి సమస్యలు చాలా మందికి ఉంటాయి. ఈ సమస్యకు జల్లెడవారు పరిష్కారం కనుగొన్నారు. కొత్త టపాలు, మూడు రోజులు , వారం, నెల రోజుల ప్రముఖ టపాలు .. ఇలా వివిధ విభాగాలు ఏర్పాటు చేసారు. ఇక మనకు తీరిక ఉన్నప్పుడు అన్ని బ్లాగులు చదువుకోవచ్చు. ఏది మిస్ అయ్యామనుకోకుండా..


ఇంతకీ ఓటెక్కడెయ్యాలో చెప్పలేదు కదా! ఇదిగో ఇక్కడ.

సర్వే బ్లాగ్జనా సుఖినోభవంతు..

Tuesday, 18 March 2008

తెల్లకాగితం - కథా కమామీషు

ఒకరోజు ఒక భక్తుడు తనకు లాటరీలో లక్ష రూపాయలు రావాలని శివుడిని ప్రార్దిస్తున్నాడు.

అది చూసి పార్వతి "నాధా ! మీకు ఎప్పుడు కళ్ళూ మూసుకుని ధ్యానం చేయడమేనా? మీ భక్తుడి మొరనాలకించలేరా? అతను అడిగిన వరము నివ్వవచ్చు కదా?" అని అడిగింది.

అంత శివుడు కళ్ళు మూసుకునే " డార్లింగ్! అతను అడిగిన వరమివ్వడానికి నాకెటువంటి అభ్యంతరమూ లేదు. కాని అతను ముందు ఆ లాటరీ టికెట్టు కొనాలిగా!!" అన్నడు.

అందుకే ముందు ధైర్యం చేసి బరిలోకి దిగాను . అంతకుముందు జరిగిన కథ...


తెల్లకాగితం అనే అంశం మీద కొత్తపాళిగారు తమ బ్లాగులో చెప్పినప్పుడు ఇది మనకు పనికి వచ్చేది కాదు అని మళ్ళీ అటువైపు వెళ్ళలేదు.ముందుగా రమగారి కథ చదివా. బావుంది అనుకున్నా. కూడలి కబుర్లలో రమ్య గారు నన్ను రాయమంటే అది నా వల్ల అయ్యే పని కాదు అందునా చిన్న పిల్లాడి కథ అని కొట్టేసా.కాని అందరు రాసే కథలు చదువుతూనే ఉన్నా. అలాగే విజయ్‌కుమార్ చెప్తున్న సూచనలు కూడా. కాని నేను కూడా రాయగలను అనే ఆలోచన రాలేదు. అప్పుడప్పుడు అనుకునేదాన్ని. రాయగలనా లేదా. కాని ధైర్యం చాలలేదు. ఎందుకంటే నా మనసులో ఉన్న ఆలోచనలు narration లా అలా రాసుకుంటూ పోయేదాన్ని. కాని కథ అంటే కాదుగా. దాని format వేరే ఉంటుంది. అది తెలీక, రాసాంటే చిన్న పిల్లల కథల ఉంటుందని అనుకున్నాను. ఆఖరు తేది వరకు ధైర్యం చెయలేదు. కాని ఆఖరి రోజు లలిత గారి కథ చదివాక , సరే ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం. ఇది మనవల్ల అయ్యే పనా కాదా అని మాత్రమే అనుకుని ధైర్యం చేసా ఎలాగైతేనేమి.

కాని అందరిలా ఆ పిల్లవాడి కష్టాలు చెప్పడం కాకుండా అతనికి సాయం చేసేవారు కూడా ఉండాలనే ఉద్దేశ్యంతో ఇలా రాసాను. ఎదో ఇచ్చిన కథాంశాన్ని బట్టి ఊహించి కథ రాయడం నాకిష్టం లేకుండింది. ఒక గృహిణికి ఎంత ధనవంతులైనా తనకిష్టమైనట్టుగా ఖర్చు పెట్టగలిగే, సాయం చేయగలిగే అవకాశం ఉండదు. అన్నీ భర్తకు చెప్పి, అతని అంగీకారం తీసుకుని చేయాలి. అందుకే ఆ పిల్లవాడికి చదువు మీద ఉన్న ఆసక్తి, తన తల్లిని సుఖపెట్టాలనే తపన చూసి సుజాత తన సొంత సంతోషాన్ని వదిలేసుకుంది. అది ఎవరికి అభ్యంతరమూ కాదు. సంజాయిషి చెప్పుకోవాల్సిన పని లేదు అనే ఉద్దేశ్యంతో అలా రాసాను. ఇది నా సొంత ఆలోచనే కాని ఎక్కడా చదివింది కాదు. ఈ కథ రాసేముందు ఏ కథను refer చేయకుండా తప్పులైనా సరే ఇక్కడ ఉన్నది మనవాళ్ళే కదా అని రాసాను. ఇక్కడ నేను బహుమతి గురించి అస్సలు ఆలోచించలేదు.

ఇలాటి ఒక చదువు కొనలేని ఒక అమ్మాయి గురించి చూడండి.

Sunday, 16 March 2008

తెల్ల కాగితం

" అమ్మా! ఒకసారి నా మాటినవే!"


"ఏంట్రా?"


"మరే ! మరే ! నువ్వు ఎప్పుడు నాకు వాళ్లని వీళ్ళని అడిగి తెచ్చిన పాత పుస్తకాలనుండి తీసిన కాగితాలతో మళ్ళీ క్లాసు బుక్కుల్లా కుట్టి ఇస్తావు కదా ! ఒక్కసారి కొత్త పుస్తకం కొనివ్వవా? నాకు అందరి కంటే ఎక్కువ మార్కులొచ్చినా కూడా మా ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తున్నారు. చిత్తు కాగితాలోడా అని."


" నేనేం చేసేదిరా? మీ అయ్య సంపాదించినదంతా తాగుడుకే తగలేస్తాడూ. నిన్ను కూడా పనిలో పెడతానంటే నేనే నీ ఏడుపు చూడలేక స్కూల్లో వేసా కదా! రెండిళ్ళు ఎక్కువ ఒప్పుకుని అతి కష్టం మీదా నీ ఫీజులు, బట్టలు చేయగలుగుతున్నా కదా. ఇప్పుడూ కొత్త పుస్తకాలంటే ఎలారా ? కాస్త నువ్వే సర్దుకో. నా బంగారం కదూ ! "


"సరే మరి ! కాని ఒక్కసారైనా కొత్త పుస్తకం కొనిస్తావా? ఆ తెల్లని కాగితం ఎంత ముద్దుగా ఉంటుందో ? దాని మీద అట్ట వేసి నా పేరు రాసుకుంటే !"


" అమ్మా! నేను పెద్దవాడినయ్యాక నువ్వు అస్సలు ఎవరింట్లో కూడా పని చేయడానికి వీలులేదు తెలిసిందా. నేను బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేసి నీ పనులన్నీ చేయడానికి పనిమనిషిని పెడతాను"


వంటిల్లు వెనకల పెరడులో అంట్లు తోముతున్న కనకమ్మ, ఆమె కొడుకు మాటలు వింటుంది వంట చేస్తున్న సుజాత. పదేళ్ళ ఆ పిల్లాడికి చదువు మీద ఉన్న ఆశ, తల్లిని సుఖపెట్టాలన్న తపన, పుస్తకాల గురించి అనుభవిస్తున్న బాధ అర్ధం చేసుకుంది. తన భర్త వ్యాపారం చేసి పిల్లలకు అడగకముందే అన్నీ కొనిపెట్టి , ఎటువంటి కష్టం రాకుండా, అన్ని అమర్చినా కూడా పాసు మార్కులు తెచ్చుకుంటున్నారు. ఈ కుర్రాడికి మాత్రం క్లాసులో అందరికంటే ఎక్కువ మార్కులు. ఇలాటి వాడికి ఎవరూ సాయం చేయడానికి ముందుకు రారు అనుకుంది.


ఆ రోజు రాత్రి భర్తతో " ఏమండి ! మన కనకమ్మ కొడుకు చదువులో చాలా చురుకుగా ఉన్నాడు. కొత్త పుస్తకాలు లేకున్నా కూడా క్లాసులో ఫస్టు మార్కులు తెచ్చుకుంటున్నాడు. అతని చదువుకోసం మీరు సాయం చేయకూడదూ" అని అడిగింది సుజాత.


దానితో అతను కాస్త చిరాగ్గా " చూడు సుజాత ! నేను కష్టపడేది మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం కాని ఎవరో పనిమనిషి కొడుకు కోసం కాదు. ఈ విషయం గురించి మళ్ళి అడగకు నన్ను" అని వెళ్ళిపోయాడు.


మరునాడు సుజాత బాగా ఆలోచించింది. " ఈ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉంది. నా భర్త సహాయం చేయడానికి ఒప్పుకోలేదు. నాకంటు సంపాదన లేదు. ఎలా ఆ అబ్బాయికి సాయం చేసేది" . చివరకు ఒక నిర్ణయానికి వచ్చింది తన స్వంత ఖర్చులు, ఆడంబరాలు కొన్ని తగ్గించుకుని ఆ అబ్బాయికి సాయం చేయాలని. పండగలకు , పుట్టినరోజుకు తను కొనుక్కునే చీరలు, పార్టీలు ఖర్చు తగ్గించుకుని ఆ డబ్బు కనకమ్మ కొడుకు చదువుకు ఇవ్వాలని .. కనకమ్మను కొడుకును తీసుకుని రమ్మని కబురు చేసింది.


"ఓరేయ్ ! మురళి ! నీకు బాగా చదువుకోవాలని ఉందా ?"


"అవునమ్మగారు! నేను బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేసి అమ్మను పని చెయ్యకుండా ఇంట్లోనే ఉంచుతాను."


" అయితే నీ చదువుకు అయ్యే డబ్బులు నేను ఇస్తాను. కాని నువ్వు ఎప్పుడు క్లాసులో ఫస్టు మార్కులు తెచ్చుకోవాలి. ఎప్పుడు గాని మార్కులు తగ్గినా నేను డబ్బులివ్వడం మానేస్తాను. తర్వాత నీ ఇష్టం. బాగా కష్టపడి చదువుకుంటావా?"


"సరేనమ్మగారు ! బాగా చదువుకుంటా. "


" ఐతే ! ఈ తెల్లకాగితం తీసుకో. ఇలాగే ఉంచుకో. నీ మార్కులు చూసాకా నేను నీకు కొత్త పుస్తకాలు కొనిస్తాను. ఇకనుండి నువ్వు ఎప్పుడు కూడా కొత్త పుస్తకాలలోనే రాద్దువుగాని. సరేనా. పాత పుస్తకాలనుండి తీసిన కాగితాలతో కుట్టిన వాటిలో రాసే అవసరం లేదు. " అని ఒక కొత్త తెల్ల కాగితం ఇచ్చింది సుజాత వాడికి.


పదిహేనేళ్ళ తర్వాత ఒకరోజు సుజాత అలా సోఫాలో కూర్చుని పేపర్ చదువుకుంటుండగా సూటుబూటులో ఒక అందమైన యువకుడు వచ్చి "అమ్మగారు ! నమస్కారం! ఇదిగోనండి" అంటూ ఒక అందమైన ఫోల్డర్ లో ఉంచిన తెల్లకాగితాన్ని ఇచ్చాడు. సుజాతకు అర్ధం కాలేదు.


"ఎవరు బాబు నువ్వు! ఈ తెల్లకాగితం నాకెందుకు ఇస్తున్నావు?"


" మీకు గుర్తులేదా అమ్మా! నేను ఒకప్పుడు మీదగ్గర పని చేసిన కనకమ్మ కొడుకు మురళిని. మీరు నా చదువుకు సాయం చేసారు. ఇప్పుడు నేను ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం వచ్చింది. ఇవాళే ఉద్యోగంలో చేరడానికి వెళ్తు నన్నింతవాడిని చేసిన మీకు కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చాను" అని ఆమెకు పాదాభివందనం చేసాడు ఆ యువకుడు.


ఇదంతా చూస్తున్న సుజాత భర్త ఆశ్చర్యపోయాడు, తనకు తెలీకుండా తనకు డబ్బులడగకుండా ఒక పదేళ్ళ అబ్బాయికి చదువులో సాయం చేసి అతను ఇంతటి ఉన్నత శిఖరాలు చేరుకునేలా చేసినందుకు ఆమెను మనసులొనే అభినందించాడు.


" అమ్మా! మీరు పదిహేనేళ్ళ క్రింద ఇచ్చిన ఆ తెల్ల కాగితం జీవితాంతం నాతోనే ఉంటుంది. నాలో అహం పెరగకుండా, నేను కూడ మీలాగే మరొకరికి సాయం చేసేలా అది నన్ను ఎప్పుడు గుర్తుచేస్తుంటూంది." అని మరోసారి నమస్కారం చేసి సుజాతకు ఆమె భర్తకు వాళ్ళు వద్దంటున్నా పట్టుబట్టలు, కానుకలు ఇచ్చి వెళ్ళిపోయాడూ మురళి.


అతను వెళ్ళినవైపే చూస్తూ సుజాత " నేను ఈ అబ్బాయికి సాయం చేసి తప్పు చేయలేదు. నేనిచ్చిన డబ్బు నిజంగా సద్వినియోగమైంది. అంతా ఆ భగవంతుడి దయ " అని సంతోషంగా కళ్ళు తుడుచుకుంది..



అస్సలు ఈ పోటీలో పాల్గొనాలని లేదు . అసలు కథలు ఎలా రాయాలో కూడా తెలీదు. కాని మనసులో మాట రమగారు, నివేదన రమ్యగారు నన్ను కాస్త ఎగదోసారు. అయినా ఒక్క ఆలోచన తట్టలేదు. కాని నిన్నటినుండి కష్టపడి ఎలాగైతేనేమి ధైర్యం చేసి ఈ కథ రాసేసాను. ఇక చదివేవారి ఖర్మ. నేనేమి చేయలేను.. ఇకపోతే కొత్తపాళీ మాస్తారుగారికి ఒక తాయిలం ఇస్తున్నా. కాసిన్ని మార్కులు యెక్కువేస్తారని. అది ఎంతో తెలుసుకోవాలంటే మీ ఎలుక ముక్కుతో 1 దగ్గర నొక్కి 2 వరకు లాక్కు రండి.



1 మేస్టారండి. మీకు కిలో పూతరేకులు, కిలో కాజాలు, ఇంకా కావాలంటే కిలో పుల్లారెడ్డి స్వీట్లు ఇచ్చుకుంటాను. కాసిన్ని మార్కులేసేయండి. ప్లీజ్ ... 2

Wednesday, 12 March 2008

డ్రైవింగ్ నేర్చిన విధంబెట్టిదనిన ...

చాలా చాలా ఏళ్ళ క్రితం మాట. నేను నాలుగో క్లాసులో ఉన్నప్పటి సంగతులు. మొదటిసారిగా సైకిల్ నేర్చుకున్నాను. వేసవి సెలవుల్లో ఏమి తోచక ఇంట్లో సతాయిస్తుంటే అమ్మ చెప్పిండి సైకిల్ నేర్చుకో అని. అప్పట్లో అద్దెకు సైకిల్ ఇచ్చే షాపులు చాలా ఉండేవి. ఇప్పుడు అస్సలు కనపడటం లేదు. ఆ రోజుల్లో ఆటోలు కూడా తక్కువే. ఎక్కువ బస్సులు, రిక్షాలు. మేముండేది పాత బస్తీలో. అమ్మ వచ్చి సైకిల్ షాపు వాడికి చెప్పి , ఇంటి అడ్రసు అది ఇస్తే వాడు చిన్ని సైకిల్ ఇచ్చాడు. నేను మా తమ్ముల్లిద్దరు కలిసి సాయంత్రాలు నేర్చుకునేవాళ్ళం. ముందు ఇంటి ఆవరణలోనే. అద్దె ఎంతో తెలుసా అచ్చంగా పది పైసలే గంటకి. ఆ సెలవులు అలా గడిచిపోయాయి. అప్పుడప్పుడు క్రింద పడడం, దెబ్బలు తగిలించుకోవడం మామూలే.. ఐదో తరగతికొచ్చాక సెలవుల్లో పెద్ద సైకిల్ నేర్చుకోవాలనే కోరిక కలిగింది. మా ఇంటికి కొద్ది దూరంలో ఉండే ఇంకో అమ్మాయితో మాట్లాడి, ఇద్దరం కలిసి పెద్ద సైకిల్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాము. ఆ అమ్మాయి నాకంటె రెండు క్లాసులు పెద్దది. పొడుగు కూడా. పెద్ద సైకిల్ కి అద్దె పదిహేను పైసలు గంటకు. కాని ఇద్దరు అమ్మాయిలం వెళ్ళి కాస్త మర్యాదగా అడిగేసరికి , ఆ షాపు ఓనర్ కాస్త వయసులో పెద్దవాడే పది పైసలకే ఇచ్చేవాడు. అబ్బాయిలకు అస్సలు ధర తగ్గించేవాడు కాదు. ఇంకా అంత త్వరగా సైకిల్ అద్దెకు ఇచ్చేవాడు కాదు. మేమిద్దరం రోజు ఐదేసి పైసలు వేసుకుని సాయంత్రం గంట సేపు అద్దెకుతీసుకుని సైకిల్ నేర్చుకునేవాళ్ళం. సైకిల్ తెచ్చుకున్నాం సరే. మరి దాని పైకి ఎలా ఎక్కాలి. సో చుట్టు పక్కల వెతికి ఒక పెద్ద బండరాయి తెచ్చి ఖాళీస్థలంలో గోడ పక్కన పెట్టాం. సైకిల్ దాని దగ్గర పెట్టి రాయి మీద కాలుపెట్టి గోడను ఆసరాగా తీసుకుని సైకిల్ ఎక్కి మెల్లిగా నడిపించేవాళ్ళం ఇద్దరం. మళ్ళీ సైకిల్ ఆపాలన్నా, దిగాలన్నా ఆ రాయి దగ్గరకు రావాల్సిందే. మధ్యలో దిగడానికి కాలు అందదు కదా. క్రిందపడి దెబ్బలు తగిలితే దులిపేసి , మళ్ళీ సైకిల్ తీసుకుని ఆ రాయి దగ్గరకు వచ్చి మళ్ళీ మొదలెట్టేదాన్ని. సరిగ్గా అరగంట ఒక్కొక్కరికి. అలా ఓ ఇరవై రోజులు నేర్చుకున్నామేమో. ఒకరోజు సైకిల్ నడిపిస్తూ గోడకు గుద్దుకుని క్రింద పడ్డా. రెండు మూడు సైకిల్ పుల్లలు విరిగిపోయాయి. దెబ్బలు మామూలే. ఇంట్లో చెప్తే తిట్లు, షాపు వాడు ఏమంటాడో అని భయం ఇద్దరికి. మెల్లిగా వెళ్ళి ఆ షాపు ఓనర్ ఉన్నాడా లేదా అని తొంగి చూశాం. లేడు.. హమ్మయ్యా అని సైకిల్ తీసికెళ్ళి మిగతా సైకిళ్ళతో పాటు పెట్టేసి అక్కడున్న అబ్బాయికి చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి ఒకటే పరుగు.. మళ్ళీ సైకిల్ నేర్చుకుంటామనే మాట లేదు. ఆ షాపు ఉన్న సందులోకి మరిచి కూడా వెళ్ళలేదు నేను. కనపడితే తిడతాడేమో అని ఒకటే భయంతో చచ్చిపోయేదాన్ని.



మళ్ళీ పదో క్లాసులో అనుకుంటా. మా తమ్ముడిని అడిగి స్కూటర్ నేర్పించమన్నా. ముందు అమ్మ పర్మిషన్ తీసుకున్నా. స్కూటర్‍కి ఏమన్నా ఐతే నాన్నను హ్యాండిల్ చేస్తుందని. మా తమ్ముడు ముందు బేసిక్స్ చెప్పి మొదలెట్టాడు. వెనకాల తను కూర్చుని నేర్పించేవాడు. ప్రొద్దున్నే అయిదున్నరకు లేచి అరగంట నేర్చుకునేదాన్ని. అప్పుడు రోడ్ల మీద ఎవరూ ఉండరుగా. ఖాళీగా ఉంటుందని. కాని ఇక్కడ స్కూటర్ కిక్ కొట్టడం బానే వచ్చింది. కాని అలాగే స్కూటర్ ఎక్కి వెళ్ళడం అంటే భయం. సీట్ మీద కూర్చుంటే కాలు క్రింద పెట్టడం రాదు. అందదు అన్నమాట. ఇంకా అది చాలా బరువు . మళ్ళీ ఏదో ఎత్తు చూసుకుని స్కూటర్ కిక్ కొట్టి , స్టార్ట్ చేసి ఎక్కి ముందుకెళ్ళిపోవడమే. అలా కాస్త అలవాటయ్యాక మా తమ్ముడిని బస్ స్టాప్ లో దింపేసి వచ్చేదాన్ని. ఖర్మ కాలి ఆగిపోయిందంటే మళ్ళీ ఎదో అరుగు వెతుక్కోవడం. లాక్కు వెళ్ళాలన్నా బరువు. రోడ్డు మీద ఎవరన్నా వెక్కిరిస్తారని భయం. ఇలాగే ఒకసారి సెలవుల్లో మా కాలనీ సందుల్లో స్కూటర్ నడిపిస్తున్నా. సడన్‍గా ఒక సైకిల్ వాడు అడ్డం వచ్చాడు. అంతే సంగతి. ఇద్దరం గుద్దుకుని క్రింద పడిపోయాం. స్కూటర్‍కి ఏమీ కాలేదు. నాకు మోచేయికి , కాలికి దెబ్బలు తగిలాయి. సైకిల్ వాడి పుల్లలు తెగిపోయాయి. హ్యాండిల్ వంకరపోయింది. ఏమి మాట్లాడకుండా ఇంటికొచ్చేసి స్కూటర్ లోపల పెట్టి ఎవరికీ చెప్పకుండా ఊరకున్నాను. పాపం ఆ సైకిల్ అబ్బాయి కూడా ఏమీ అనలేదు. కాని చాలా రోజుల వరకు భయంగానే ఉండింది. మళ్ళీ స్కూటర్ జోలికి పోలేదు.



ఇంటర్ కాగానే సెలవుల్లో కారు నేర్చుకోమంది మా అమ్మ. సరే ఇంట్లో ఉంటే కూడా బోర్ గా ఉంటుందని , డ్రైవింగ్ క్లాసులలో చేరాను. ఓ పది రోజులు నేర్చుకున్నాక , మా పెద్దమ్మ కూతురి ఎంగేజ్‍మెంట్ ఉందని అందరం మిర్యాలగూడ నాలుగు కార్లలో బయలుదేరాము. నాకు కారు డ్రైవింగ్ ఇస్తానంటేనే వస్తా అని కండిషన్ పెడితే సరే అని మా కజిన్ కూర్చుని సిటీ దాటాక డ్రైవింగ్ ఇచ్చారు.నేను ధైర్యంగానే ఉన్నాను. వెనకాల కూర్చున్న మా బావగారు, ఇంకో పిన్ని కూతుళ్ళు, భయంతో ఉన్నారు. ఎదురుగ్గా( అదీ అవతలి రోడ్డుపై) ఏ వాహనమొచ్చినా "జ్యోతి మెల్లిగా అమ్మా" అనేవాళ్ళు. అరగంట నడిపి ఇచ్చేసా. కాని అప్పట్లో నేను మగరాయుడని అనేవారు ఇలాటి పనులు చూసి . ఐనా నేను లెక్క చేసేదాన్ని కాదు. పెళ్ళయ్యాక కూడా అప్పుడప్పుడు కారు డ్రైవింగ్ చేసేదాన్ని. ఇక మావారైతే ఇచ్చేవారు కాదు. ఆయన లేనప్పుడు కారు తీసేదాన్ని చెప్పకుండా. ఇక ఇప్పుడూ మొత్తానికే అలవాటు తప్పింది. .. వరూధిని గారి స్కూటి కథ చదివి నా అనుభవాలు రాయకుండ ఉండలేకపోయా.

హ్యాపీ బర్త్ డే గిరి

పుట్టినరోజు శుభాకాంక్షలు గిరిచంద్ నువ్వుశెట్టి..

ఎల్లప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తూ...


Send this eCard !

Tuesday, 11 March 2008

అద్భుతమైన ప్రేమ కావ్యం .. ఆడదాని మనసు



ఆడవాళ్ల మోములో కదలాడే కొన్ని ఎక్స్ ప్రెషన్లు చాలా గమ్మత్తుగా ఉంటాయి.. ఓరచూపు, కొంటె నవ్వు, కనీకన్పించక మోముపై విరబూసే చిరు దరహాసం, అదిమిపెట్టుకున్నా బయటపడే సిగ్గు, పెదాల బిగింపులో బంధీ అయ్యే గడుసుదనం, క్షణకాలంలో ప్రత్యక్షమై మరుక్షణమే మాయమయ్యే నిర్లక్ష్యం, చెలికాడి హృదయాన్ని తడిమి చూడడానికి ఎక్కుపెట్టే లోతైన భావాతీతమైన కనుచూపు, కదలికలో మార్పులేకుండానే ఉన్న చోట నుండి నలుదిక్కులూ చుట్టివచ్చే సిక్త్ సెన్స్.. నిజంగా సృష్టికర్త అద్భుత సృష్టి ఆడవాళ్లు నిజమైన ఆనవాళ్లే. మగువ పలికించినన్ని భావాలు మగవాడు వ్యక్తపరచడానికి మాటలు కూడా చాలవు. విభిన్నమైన అంశాల పట్ల మగువలకు చాలా నిగూఢమైన అభిప్రాయాలు, ముద్రలు మనోఫలకంపై ముద్రించబడి ఉంటాయి. సందర్భానుసారం అవి కొద్దోగొప్పో వారి హావభావాల ద్వారా వ్యక్తమవుతుంటాయి.. బయటకు వ్యక్తపడని మరెన్నో భావాలు.. అలా అంతర్లీనంగా ఎవరూ స్పృశించడానికి అంతుచిక్కని అద్భుతమైన పార్శ్యాలుగా ఆవిష్కృతం కాకుండా మిగిలిపోతూనే ఉంటాయి. పాపం మగవాడు బయటకు వ్యక్తమయ్యే ఆ కొద్దిపాటి భావాలతోనే మగువ మనసు లోతుని అంచనా వెయ్యాలని ఆపసోపాలు పడతాడు. కొందరైతే సముద్రం లాంటి మగువ మనసు నుండి బయటకు తొంగిచూసే ఆ కొద్దిపాటి భావాలను సైతం ఒడిసిపట్టే నైపుణ్యత లేక.. అద్భుతమైన మగువ మనసు యొక్క మొదటి పుటనే చదవలేక మొండిగా జీవిస్తుంటారు. తనని గెలుచుకున్న మగవాడికి బంధీ అయి అతని రక్షణలో సేదదీరాలని మగువ మనసు ఉవ్విళ్లూరుతుంటుంది.. కానీ మగవాడు తాను గెలుచుకున్న వనితని కట్టు బానిసని చెయ్యాలని చూస్తుంటాడు. నిలువెల్లా ప్రేమతో తనను తాను అర్పించుకున్న మగువ మనసు లోతులను తడిమిచూసే నైపుణ్యత లేక.. మగువ తనని తాను మరిచిపోయి మగవాడి సాన్నిహిత్యంలో సేదదీరే అవకాశాన్ని ఆసరాగా చేసుకుని ఆమె మనసులో ప్రేమను పాదుకొల్పవలసింది పోయి భౌతికంగా ఆధిపత్యం సాధించడానికి ప్రయత్నిస్తాడు మగవాడు. రెండు మనసుల మధ్య పెనవేసుకుపోవలసిన అలౌకికమైన అనుబంధం బిగిసీ బిగియకముందే సన్నగిల్లడం మొదలవుతుంది. తమ భాగస్వామి మనసు పుటలను చదివి ఒకరికొకరు తన్మయత్వంతో మునిగితేలే అదృష్టం ప్రపంచంలో ఏ కొద్ది జంటలకో ఉంటుంది. మిగిలిన వారంతా ఎంతో అన్యోన్యంగా ఉన్నప్పటికీ అది మనసు పై పొరల్లో సున్నితమైన కుటుంబ సంబంధాల కోసం, దాంపత్య సౌఖ్యం కోసం, సామాజిక అవసరాల కోసం ఒక నిర్థిష్టమైన ప్రమాణం వద్ద తమ భావాలను స్థిరీకరించుకుని ఇరువురు భాగస్వాములూ సమన్వయంతో సాగించే ప్రయాణమే. మగువల మనసుల్లో అంతర్లీనంగా ప్రవహించే భావాల ప్రవాహంలో తానూ మునిగితేలుతూ అంతటి అపూర్వమైన ప్రేమని మనసారా ఆస్వాదిస్తూ ఆ మగువ మనసులో మగవాడూ మమేకం అయినప్పుడే జీవితం అద్భుతమైన ప్రణయకావ్యం అవుతుంది.

నేను సంవత్సరానికి ఒకటో రెండో సినిమాలు చూస్తాను. అలా కొద్దిరోజుల క్రితం జోధా అక్బర్ సినిమా చూసేటప్పుడు నటీనటుల హావభావాలు నా మనసులో రేకెత్తించిన అలజడులు ఇది రాయడానికి ప్రేరణగా నిలిచాయి.

- నల్లమోతు శ్రీధర్

Monday, 10 March 2008

కోతల రాణి

" టింగు టింగ్ టింగు టింగ్.."


తలుపు తీసి చూస్తే ఆశ్చర్యం!.. నేను చూస్తున్నది నిజమేనా ! కలా !! అని కళ్ళద్దాలు తుడుచుకుని మళ్ళీ చూసా.


ఎదురుగా TRS నేత చంద్రశేఖర రావు గారు. "నమస్తే జ్యోతక్క! బాగున్నవా? కాస్త మమ్మల్ని ఇంట్లకి రానిస్తవా. కొంచం మాటాడాలె" అన్నారు.


" రండి . రండి. కాని మీరు తప్ప మిగతావారు బయటే ఉండాలి" .


సరే ! నీ ఇష్టం " అంటు లోపలికొచ్చి కూర్చున్నారు.


చెప్పండి సర్ ! నేను జ్యోతక్క అని ఎవరు చెప్పారు. అసలు నాతో మీకేం పని?" అని అడిగా.


" అన్ని చెప్త గాని . నా గురించి తెలుసుకదా. గిప్పుడో గప్పుడో ఎలక్షన్లు ఒచ్చేటట్టున్నయి. నీ గురించి నా పార్టీవోళ్ళు చెప్పిన్రు. ఇంటర్నెట్ ల మస్తు రాస్తవంట కద. ఎవడన్నా తిక్క తిక్కల్గా మాట్లాడితే మన బాషల దులిపేస్తవంత గదా. నీ అసుంటోల్లే మాకు కావాలె. జర సాయం చేయరాదె. నాకంటే చిన్నదానివైనా నేను కూడ జ్యోతక్క అనే అంట. ఇగ పని ఏందంటే మా పార్టీ తరఫున నువ్వు ఇంటర్నెట్ల ప్రచారం చేయాలె. నీ ఇష్టమునట్టు కాంగ్రేసోల్లను, తెలుగుదేసమోల్లను తిట్టు, మ్యాటర్ నేనిస్త. నీకు ఎటువంటి ప్రమాదం లేకుండ చూసే బాధ్యత నాది. బయట మీటింగులల్ల, ప్రెస్సోల్లతోని చేయనీకి చాలామంది ఉన్నరు, కాని ఇలా ఇంటర్నెట్ల కూడ ప్రచారం చేస్తే మస్తుగుంటది. అది నువ్వే మొదలెట్టాల. ఏమంటావ్ మరి. నీకు ఇంటర్నెట్ల తెల్సినోల్లు చాలా మంది ఉన్నరు గదా. పేపర్లల్ల నీ పేరు ఒస్తుందని కూడా తెలుసు. ఫ్రీగ కాదు పైసలిస్తము నువ్వు అడిగినంత. సరే అని చెప్పాలే మరి?" అని అన్నారు కె.సి.ఆర్ గారు.


నేనేమంటాను. టీ ఇచ్చి పంపేసా. తర్వాత చెప్తా అని.


చీ ! చీ ! పొద్దున్నే నా మూడ్ అంతా పాడయింది. ఇంకా వంట పని మొదలెట్టలా? అనుకుంటు నా పని పూర్తి చేసుకుని పేపర్ చూస్తుంటే


"ట్రింగ్.. ట్రింగ్.. ట్రింగ్.."


"హలో! ఎవరూ?"


" జ్యోతిగారు ఉన్నారా? పిలుస్తారా? "


"నేనే మాట్లాడుతున్నా! ఎవరు?"


"నమస్తే జ్యోతిగారు ! మేము కె ఎ . పాల్ గారి ఆఫీసునుండి మాట్లాడుతున్నాము. మీతో పాల్ గారు మాట్లాడతారంట.


అర్జెంట్ అని చెప్పమన్నారు."


"ఓకె . ఇవ్వండి" (మనసులో భయం, చిరాకు. వీడికి నాతో పనేంటి అని?)


"నమస్కారం జ్యోతిగారు. మీకు ఆ ప్రభువు ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండుగాక. మేము ఒక ముఖ్యమైన పని కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవలసి వచ్చింది. మమ్ములను క్షమించండి. మీరు ఇంటర్నెట్లో చాలా బాగా రాస్తారని మాకు తెలిసింది. మేము త్వరలో ఎలక్షన్లలో మా పార్టీ సభ్యులను పోటీలో పెట్టి కాంగ్రేస్, తెలుగుదేశం, టిఆర్ ఎస్ పార్టీలన్ని డిపాజిట్ కూడ దక్కకుండా చేస్తాము. వారి రహస్యాలన్నీ మాదగ్గ్గరున్నవి. అవి మీరు ఇంటర్నెట్లో మీదైన శైలిలో రాసి ప్రచారం చేయగలరా? మీకు కావలసిన రుసుములు కూడా చెల్లించగలము. ఆలోచించుకుని మాకు సరే అను సమాధానం చెప్పండి. ఈ కుటిల రాజకీయ నాయకులనుండి మన రాష్ట్రమును కాపాడుకొనుటలో మాకు సాయపడండి. ఆ దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని సదా తన నీడలో కాపాడతాడు."


"సరే ! చూద్దాం. మళ్ళీ ఫోన్ చేయొద్దు." అని పెట్టేసాను.


ఇదేంట్రా దేవుడా? ఇవాళ పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసానో.. ఈ చెత్తనాయాల్లందరు తగులుకున్నారేంటీ?" అనుకుంటూ వేడి వేడి మసాలా టీ చేసుకుని అప్పుడే మొదలయిన తలనొప్పికి ముందే మాత్ర వేసుకుని పడుకున్నా.


మళ్ళీ " టింగు.. టింగ్ టింగు .. టింగ్..


మళ్ళీ ఎవడొచ్చాడో అని తిట్టుకుంటూ తలుపు తీస్తే కొరియర్ అబ్బాయి. ఉత్తరం తీసుకుని తలుపేసి వచ్చి పడుకుని గంట తర్వాత లేచి ఆ ఉత్తరం చదివితే కళ్ళు తిరిగిపోయాయి. అది ఎవరినుండంటే ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్ నుండి.


"అమ్మా ! జ్యోతిగారూ! నమస్కారం. మీరు జ్యోతక్కగా చాలా ఫేమస్ అని మాకు ఇటీవలే తెలిసింది. మీరు రాసే రచనలు, అనామకులను నిర్ధాక్షిణ్యంగా దులిపేసే పద్ధతి మాకు నచ్చింది. మీలాటి మహిళలే మన రాష్ట్రానికి, దేశానికి కావల్సింది. మీరు మా పార్టీ తరఫున ఇంటర్నెట్లో ప్రచారం చేయగలరా? మీకునచ్చినట్టుగా. వివరాలు మా సూరీడుతో పంపిస్తాను. మీకు ఎటువంటి ప్రమాదం ఉండబోదని నేను హామీ ఇవ్వగలను. అవసరమనుకుంటే మా సూరీడును రోజుకు గంట సేపు పంపిస్తాను. అతను ఎటువంటి పనైనా చేసిపెట్టగలడు. . మా మాట తిరస్కరించకుండా ఒక్కసారి ఆలోచించండి. అన్నీ లాభాలే కలుగుతాయి. " అని ఉంది.


ఇవాలేంటి నా ఖర్మ ఇలా కాలింది. అని తలకు పావు సేరు నూనె మర్ధనా చేసుకుని తలారా స్నానం చేసి , ఏదైనా బ్లాగు రాద్దామనుకుని నా మెయిల్ ఓపెన్ చేసా ముందు. మా గ్రూఫు మెయిల్స్, బ్లాగు గుంపు మెయిల్స్ చూస్తుంటే మధ్యలో ఒక కొత్త మెయిల్ కనిపించింది. ఎవరా అని ఆలోచిస్తూ యధాలాపంగా మెయిల్ ఓపెన్ చేసా. పంపింది చంద్రబాబునాయుడు అని చూడగానే టక్కున అది డిలీట్ చేసా చదవకుండానే..


ఇక లాభం లేదు . ఇవాలేదో అయింది. అని నన్ను నేనే తిట్టుకుంటుండగా


"వాతాపి గణ పతింభజే " అంటూ వినిపించింది. టక్కున మెలకువ వచ్చింది. అలారమ్ ఆపేసి అయోమయంగా లేచి కూర్చున్నా. పది నిమిషాల వరకు ఏమీ అర్దం కాలేదు. నేను ఎక్కడున్నాను అని కూడా తెలీలేదు. టైమ్ చూస్తే ఉదయం ఐదైంది.

"అమ్మో ఇదంతా కలా? ఇంకా నయం.. బ్రతికున్నాను. " అంటూ పనిలో పడిపోయా.


ఇదంతా ఓవర్ గా ఉంది కదా. ఉండదు మరి..అన్నీ కోతలైతే.

ఊరికే కోతలు కోస్తే ఎలా ఉంటుందో అని రాసానన్నమాట . అస్సలు ఈ రాజకీయాలంటేనే నాకు పడదు.

ఎప్పుడూ తిట్టడమేనా, మనమేం చేస్తున్నామో తెలుసుకోమా ??

నిద్రలేచింది మొదలు బండబూతులు తిట్టుకునే రాజకీయ నాయకులను చూస్తూ, డబ్బు తప్ప ఇంకేమీ మానవతావిలువలు తెలియని బంధువులు, స్నేహితులను చూస్తూ, సమాజంలో మన కళ్లెదుట కన్పించే ప్రతీ వక్రమైన వ్యవస్థని, పరిస్థితిని చీదరించుకుంటూ కొంతమంది "ఇంకా ఈ సమాజం ఏమి బాగుపడుతుంది" అని తమ సామాజిక బాధ్యతని కూడా వదిలేసి తామూ తమ పనుల్లో, తమకు తెలియకుండానే తాము గుర్తించకుండానే తామూ పీకల్లోతు స్వార్థంలో కూరుకుపోతుంటారు. ఏదైనా అంశాన్ని విమర్శించడానికి పూనుకునేటప్పుడు ఆ అంశం నుండి విడిపోయి మనమేదో దేశోద్ధారకులమన్న భ్రమని కలిగించే మన మనసు.. విమర్శించడం పూర్తయిన తర్వాత మాత్రం తన సహజనైజంలో తానూ ఇంతకుముందు ఏ అంశాన్నయితే విమర్శించిందో దానిలో భాగమైపోతుంది. అంటే మనం ప్రతీదాన్నీ విమర్శిస్తూనే మనమూ ఆ విమర్శించబడిన అంశంలో భాగమై పయనం సాగిస్తున్నాం. అసలు మనమేమీ మన వంతు సహాయం సమాజానికి చేయకుండా సమాజాన్ని విమర్శించే హక్కు మనకు ఎక్కడ ఉంది? అంతెందుకు ఇదంతా రాస్తున్న నాతో సహా మనమందరం అవకాశం దొరికితే నీతులు చెప్పేవాళ్లమే, కానీ వాటిని ఎంతోకొంత ఆచరించినప్పుడే కదా మన మాటలకు విలువ ఉండేది. సమాజం అలా అయిపోతోంది, ఇలా అయిపోతోంది అయి నిరంతరం తిడుతున్నాం.. కానీ అసలు మనం సమాజానికి ఏం చేస్తున్నాం ఎప్పుడైనా ఆలోచించారా? చాలామందికి సామాజిక సేవ అంటే చాలా చులకనభావం ఉంది. పనీపాట లేని వాళ్లు మాత్రమే సామాజిక సేవ చేస్తారన్న దురభిప్రాయం ఉంది. అవును లక్షల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ లు పెంచుకోవడమే పెద్ద పని, గొప్ప జీవితం అనుకుంటే మానవత్వానికి మచ్చుతునకలుగా మదర్ థెరిసా, మహాత్మాగాంధీ వంటి వారు ఒక్కరూ మిగిలేవారు కాదు. లక్షలు లక్షలు కూడబెట్టి బ్యాంకుల్లో నిల్వ చేసుకుందాం.. అలా మనం మన స్వార్థాన్ని చూసుకుంటేనే.. "అసలు మానవ సంబంధాలు కరువైపోతున్నాయండీ, అన్నీ ఆర్థిక సంబంధాలే" అని లెక్చర్లిద్దాం, మాటలతో మంచితనం మూటకట్టుకుందాం. అంటే ఫోజులు కొట్టడానికీ, మాటలు చెప్పడానికీ మాత్రమే సామాజిక సేవ పనికొస్తుంది తప్ప అందులోకి దిగి మనమూ పాలుపంచుకోవాలంటే మాత్రం అదో పనికిమాలిన వాళ్లు చేసే పనే కదా మన దృష్టిలో! సమాజంలో ఎక్కడో దౌర్భాగ్యం లేదు.. మనం ఏ వ్యవస్థనైతే దుమ్మెత్తిపోస్తున్నామో ఆ వ్యవస్థలో కాదు లోపం ఉన్నది.. అక్షరాలా మనలోనే లోపం ఉంది. అసలు మనం కనీస సామాజిక బాధ్యత నెరవేర్చకపోతే.. అందరూ దూరంగా ఉండి తిట్టే మనలాంటి ఫోజుల రాయుళ్లే అయితే ఇంకా సమాజాన్ని బాగు చెయ్యడం ఎవరి తరం అవుతుంది? పుడతాం, యవ్వనాన్ని ఎంజాయ్ చేస్తాం, పెళ్లి చేసుకుంటాం, నాలుగు రాళ్లు సంపాదించుకుంటాం, పిల్లల్ని కంటాం, వృద్దాప్యంలో రోగాలతో పోరాడి వెళ్లిపోతాం. ఈ ప్రాసెస్ మొత్తంలో అంతా మన చుట్టూ మనమే గిరిగీసుకుని తిరుగుతున్నాం కానీ ఎప్పుడైనా బయట ప్రపంచం పట్ల మనం నెరవేర్చవలసిన బాధ్యతల పట్ల దృష్టి పెడుతున్నామా? ఇలా పుడుతూ, కంటూ, చస్తూ జీవితాన్ని లీడ్ చెయ్యడానికి మానవజన్మే ఎందుకు అన్నీ జంతువులూ అదే పనిచేస్తున్నాయి కదా! చాలామంది డబ్బుకు సమాజం విలువ ఇస్తుంది అనుకుంటారు. అందుకే విరగబడి డబ్బు సంపాదిస్తుంటారు. కానీ డబ్బు సంపాదించే వారికి దొరికేది పై పై గౌరవమే. డబ్బుతోపాటు శత్రువులూ, ద్వేషించేవారూ పెరుగుతారు. దీనికి కారణం డబ్బుతోపాటు మనలో చోటుచేసుకునే మానసిక వికారాలు కావచ్చు, ఇతరత్రా అంశాలు కావచ్చు. అదే మీరు పదిమందికి మీకు చేతనైన రీతిలో సహాయం చెయ్యండి, మీ ప్రేమని అభిమానాన్ని పంచండి.. అసలు దానికి మించిన సంతృప్తి ఎక్కడైనా లభిస్తుందేమో మీరే చూడండి. ఇది చదివిన అందరికీ ఓ మనవి, ఇది చదివి కొంతమందైనా సమాజాన్ని, వ్యవస్థని తిట్టడం మానేసి కనీసం కొద్దిగానైనా తమ సామాజిక బాధ్యతని నెరవేర్చడం అలవాటు చేసుకుంటే దీనిని రాయడం వెనుక నా ఉద్దేశం నెరవేరినట్లే. ఇలాంటివి చాలాచోట్ల చదివాం.. మేము మారము.. మేము ఇలాగే ఉంటాం అంటారా.. అలాగే ఉండండి ఫర్వాలేదు. ఏదోరోజు మీలో మార్పు వస్తుంది అని నాకు ఖచ్చితంగా తెలుసు.

- నల్లమోతు శ్రీధర్

Saturday, 8 March 2008

తెలుగు వెలుగు - బ్రేవ్



ఆస్టేలియా బ్రిస్‍బేన్ పట్టణంలోని తెలుగువారు ప్రచురించే "తెలుగు వెలుగు" మార్చి నెల పత్రికలో వచ్చిన వ్యాసం.

Thursday, 6 March 2008

పుణుకులు

1. తేడా
"భార్యా విధేయుడికి, భార్యా బాధితుడికి ఏమిటి తేడా?"

"చెప్పకముందే పనులన్నీ చేసి భార్య మెప్పును పొందేవాడు భార్యా విధేయుడు."

" చెప్పాకే పనులు చేస్తూ ఒకోసారి చివాట్లు కూడా తినేవాడు భార్యా బాధితుడు."


2. వీలునామా
"ఏంట్రా దిగాలుగా ఉన్నావ్?" అడిగాడు కిరణ్ తన స్నేహితుడు చైతన్యను.

" మా నాన్న తన తదనంతరం యావదాస్తిని నా పేరు మీద విల్లు రాశాడురా." చెప్పాడు చైతన్య.

"వ్వావ్! మరైతే ఆనందంగా ఉండాలి కాని అలా దిగులుగా ఉన్నావేంటి?"

"ఆయన గుండులా ఉన్నాడు.మరో పాతిక ముప్పయ్యేళ్ళయినా కనీసం జ్వరం కూడా వచ్చే చాన్స్ లేదు." అంటూ నిట్టూర్చాడు
చైతన్య.


3. ముగ్గురు పిల్లలు ఆటలాడి అలసిపోయి కూర్చుని తమ తండ్రుల గురించి మాట్లాడుకుంటున్నారు.

రాజు : "ఓరేయ్! మా నాన్న తెలుసా! బాణం వేసాడంటే దానికంటే ముందే అవతలి దిక్కుకు చేరుకుంటాడు."

అలీ : "ఓస్ అంతేనా! మా నాయన ఐతే తుపాకి కాలిస్తే ఆ గుండు కంటే ముందే వెళ్ళిపోతాడు తెలుసా?"

మల్లేష్ :"ఇగ మా అయ్య సంగతి ఇనుకోండి. అయ్య పని జేసే ఆఫీసు ఐదు గంటలకు బంద్ ఐతే, అయ్య నాలుగు గంట్లకే ఇంట్లో
ఉంటడు మల్ల . ఎందుకో తెలుసా? సర్కారీ నౌకరీ కదా!"

4. ఉతుకుడు

పెళ్ళైన స్త్రీలు పూర్వం తెలుగులో తోమేవారు, ఇప్పుడు హిందీలో తోముతున్నారు. ఏంటది????

వైవిధ్యతే విజయానికి పునాది

ఒక అవసరాన్ని వేర్వేరు వ్యక్తులు వేర్వేరు మార్గాల్లొ తీర్చడానికి ప్రయత్నించినప్పుడు ఎక్కువ మంది ఏ పద్ధతినైతే హర్షిసారో అదే విజయం సాధిస్తుంది. పెద్ద పెద్ద కార్పోరేట్ సంస్థలు మొదలుకుని సాహిత్యం, క్రీడలు, సినిమాలు వంటి రంగాలన్నింటిలోనూ కామన్‍గా వర్తిస్తున్న ఫేక్టర్ "వైవిధ్యత"! ఒకరిని అనుసరించే వారు ఎప్పుడూ "అనుసరించే " స్థితిలోనే ఉంటారు తప్ప "ఆదర్శప్రాయమైన" హోదాని ఆర్జించరు. మీరు మీ రంగంలో అత్యుత్తమమైన విజయాలను స్వంతం చేసుకోవాలన్నా, యావత్ ప్రపంచం మన్ననలనీ పొందాలన్నా లక్ష్యాన్ని సాధించడంలో రేయింబవళ్ళూ కష్టపడడానికి తోడు మీ ప్రయత్నంలో వైవిధ్యతను ఆపాదించుకోవాలి. ఫలానా వ్యక్తి ఫలానా విధంగా కష్టపడ్డాడు. కాబట్టి అదే మార్గాన్ని అనుసరిస్తే మనమూ సక్సెస్ అవుతాం అన్న ధోరణి మీ ఉనికినైతే కాపాడగలుగుతుందేమొ తప్ప మీకంటూ "మీకో" ప్రత్యేకత ఆపాదించలేము. ఎందరో సినిమా తారలు ఉన్నారు. అందరిలోనూ అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్‍గా పరిగణించబడుతున్నాడెందుకు? అప్పుడప్పుడు ఒక్క మ్యాచ్‍లోనూ సరిగ్గా రాణించకపోయినా సచిన్ టెండూల్కర్‍ని క్రికెట్ అభిమానులు ఆరాధ్య దైవంలా కొలుస్తున్నారెందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? వారి వారి రంగాల్లొ వారు తమకంటూ ఒక ముద్ర వేసుకున్నారు కాబట్టి . మీరు ఓ స్టూడెంట్ కావచ్చు. ఉద్యోగి కావచ్చు. బిజినెస్ పర్సన్ కావచ్చు. మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా పదిమంది గుర్తుంచుకునేలా మీదైన స్వంత బాణిలో మీ ముందున్న లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి శ్రమించండి. ఖచ్చితంగా అందరి దృష్టి మీ వైపే తిరుగుతుంది. ఆటోమేటిక్‍గా విజయం మిమ్మల్ని వరిస్తుంది.

నల్లమోతు శ్రీధర్

Tuesday, 4 March 2008

కనబడుట లేదు ...





మార్చి 3 నాడు ఆంధ్రజ్యోతి దినపత్రికలోని నవ్య విభాగంలో ప్రచురించబడిన ఈ సరదా వ్యాసం. ఇందులో మొదటిభాగం గతంలో పొద్దులో ప్రచురితమైంది. అనామకులకు ముందస్తు హెచ్చరిక. ఇది నా స్వంత రచన.



అందరికీ నమస్కారం. నాదొక విన్నపం. గతవారం రోజుల నుండి మా శ్రీవారు కనబడడం లేదు. గొడవేం లేదండి. పత్రికలలో ప్రకటన చూసి వారి 'బట్టతలపై హృతిక్‌రోషన్‌లా జుట్టు మొలిపించుకోండి' అని, ఇంకా అదేదో సినిమా చూసి 'నాకూ ఆదివారం సెలవు కావాలి' అని అన్నా అంతే. కోపంతో ధుమధుమలాడుతూ వెళ్లిపోయారు. ఇలా అడగడం తప్పా చెప్పండి? రెండ్రోజుల్లో తిరిగొస్తారులే అని ఊరుకున్నా. ఎక్కడికెళ్లారో ఆచూకీ తెలీటం లేదు. ఆయన పేరా? అమ్మో భర్త పేరు ఎలా చెబుతారండి? పాపం కదూ? ఆయన ఫోటో సరియైనది లేకపోవడం వల్ల ఆయనకు సంబంధించిన వివరాలు ఇస్తున్నాను.
l. ఇంట్లో ఎప్పుడూ సీరియస్‌గా ఉన్నా, బయటికెళ్తే మాత్రం అందరితో సరదాగా జోకులేస్తూ, నవ్విస్తూ, నవ్వుతూ ఉంటారు. ఏంటో మరి?
2. ఎప్పుడైనా వంట బాగా లేకపోతే కోపంతో చిందులు తొక్కుతారు. బాగుంటే మాత్రం 'బా గుంది' అనరు. కామ్‌గా తినేసి వెళ్లిపోతారు.
3. నా పుట్టిన రోజు, పెళ్లి రోజు లాంటివి ఆయనకు గుర్తుండవు. పనీ పాటా లేని నాలాంటి వారే 'సెంటిమెంటల్‌ ఫూల్స్‌'గా ఉంటారని ఆయన అభిప్రాయం.
4. స్నేహితులతో ఎన్ని గంటలైనా సరదాగా మాట్లాడగలరు, భార్యతో మాత్రం పది నిమిషాలు మాట్లాడడానికి కూడా టైంలేనంత బిజీ మనిషి
5. నీకీ చీర బావుంది, నువ్వంటే ఇష్టం, నువ్వు చాలా అందంగా ఉన్నావులాంటి అనవసరపు మాటలంటే ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు.
6. నేను చేసిన పలావ్‌ నచ్చదు కాని పక్కింటోళ్లు ఇచ్చిన పచ్చగడ్డి మాత్రం పరమాన్నంలా మిగల్చకుండా తినేస్తారు.
7. కష్టపడి పది రూపాయలు సంపాదిస్తే తెలుస్తుంది డబ్బు విలువ. ఇంట్లో తిని కూర్చుని, ఇరుగు పొరుగు అమ్మలక్కలతో సొల్లు కబుర్లేసుకునే వారికి ఏం తెలుస్తుంది లాంటి డైలాగులు రోజుకొకసారైనా అంటుంటారు.

మొత్తం మీద "తినడానికి''..."పడుకోవడానికి'' మాత్రమే ఇల్లు ఉన్న ది అన్నట్టు ప్రవర్తిస్తారు. పై లక్షణాలున్న వ్యక్తి కనబడితే పట్టుకొచ్చి నాకు అప్పచెప్పండి ప్లీజ్‌. మీకు రానూపోనూ ఆటో చార్జీలు కాని బస్‌ చార్జీలు కాని ఇస్తాను.

ఇట్లు వీర వెంకట అలమేలు మంగతాయారు దీక్షితులు హైదరాబాద్‌



అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ దీక్షితులండి. ఎవరా అనుకుంటున్నారా? అదేనండి.. నెలక్రితం 'కనపడుట లేదు' అని మా ఆవిడ వీరవెంకట అలమేలు మంగతాయారుప్రకటన ఇచ్చింది కదా. ఆ శాల్తీని నేనేనండి. ఇంటికొచ్చేసానండి. రాక చస్తానా. అయినా ఎవడా అడ్డ గాడిద అన్నది ఆడది ఇల్లు దాటితే మంచిది కాదు, బయటికెళ్లి బతకలేదు అని. నిజానికి పెళ్లైన మగాడు ఇల్లొదిలి వెళితే అస్సలు బతకలేడండి. నా స్వానుభవంతో చెబుతున్నా. ఇంట్లో మనశ్శాంతి లేదని వెళ్లిపోతే పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టైంది నా పరిస్థితి. మా ఆవిడ చెప్పిన విషయాలు గురించిన నిజాలు, నేను పడ్డ కష్టాలు చెప్పుకుందామని ఇలా వచ్చాను. కాస్త ఊరట కలుగుతుందని.
1. నేను ఇంట్లో సీరియస్‌గా ఉంటాను అంటుంది. కాని తను ఎప్పుడు చూసినా టీవీలో చెత్త సీరియల్స్‌ చూస్తూ అవి మా ఇంట్లో
జరుగుతున్నంతగా లీనమైపోతుంది. ఎవరితో మాట్లాడదు. పైగా వాటి గురించి ఇరుగుపొరుగమ్మలతో చర్చలు.
2. ఏదో పెళ్లయిన కొత్తలో వండిన కూరలు బావున్నాయంటే ఇక ప్రతీ రోజూ చెప్పాలా.అసలే ఆఫీసుకెళ్లే టెన్షన్‌.వంట బాగోకుంటే
కోపంరాదా మీరే చెప్పండి.
3. తన పుట్టిన రోజు, పెళ్లి రోజు నాకెందుకు గుర్తుండవు.నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ప్రతి సంవత్సరం జేబుకు
చిల్లుపెట్టుకుని మరీ గుర్తు చేసుకోవాలా.పైగా వాళ్ల మొగుడు ఖరీదైన చీర కొన్నాడు..వీళ్లాయన ఇంత ఖరీదు బహుమతి
ఇచ్చాడు అని వాళ్లతో పోల్చుకుని నా ప్రేమను బేరీజు వేయడం బాగుందా..?
4. నా స్నేహితులతో మాట్లాడతాను తనతో మాట్లాడను అంటుంది కదా, ఎప్పుడన్నా కాస్త సరసంగా మాట్లాడదామని పలకరిస్తే
చాలు..వాళ్లవి కొన్నారు,ఇవి కొన్నారు..మనమెప్పుడు కొందామంటూ నస పెడుతుంది.మీరే ఆలోచించండి ఇంట్లో ఉండ బుద్దేస్తుందా?
5. పెళ్లై పదేళ్లయ్యింది. ఇంకా రుచిగా వండడం రాదు.పుస్తకంలోనో, టీవీలోనో చూసి ప్రయోగాలు చేస్తుంది.నేనూ మనిషినే కదా?

6. మహిళా మండలి మీటింగుల్లో పడి ఇంటివిషయమే పట్టించుకోదు.సరుకులెన్ని తెచ్చిచ్చినా అన్నీదుబారాగా వాడేస్తుంది.అందుకే
సొల్లు కబుర్లు చెపుతావు..డబ్బు విలువ తెలియదన్నాను.తప్పా.. చెప్పండి.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఉన్నట్టుండి ఒక రోజు వచ్చి ఏదో పేపర్‌ కటింగ్‌ తెచ్చి ఏవండి మీరు కూడా బట్ట తల మీద జుట్టు
మొలిపించుకోండి అంటూ గొంతెమ్మ కోరికొకటి కోరింది. పైగా జస్ట్‌ పాతిక వేలంట అంటుంది. మళ్లీ ఒకరోజు ఏదో సినిమా చూసొచ్చి.. నాకూ ఆదివారం సెలవు కావాలి.. ఇంట్లో పనంతా మీరే చేయాలి. ఇది మా కాలనీ మహిళా మండలి నిర్ణయం అని తెగేసి చెప్పింది. ఏదని భరించను.. కాస్త మనశ్శాంతిగా ఉంటుందని ఇల్లొదిలి వెళ్లిపోయా. అయినా ప్రశాంతంగా బతకనిచ్చిందా... పేపర్లో ప్రకటన ఇచ్చి నా బ్రతుకు బజారు పాలు చేసింది. అది చూసి నాకు ఆశ్రయం ఇచ్చిన స్నేహితుడి పెళ్లాం మా వాడికి వార్నింగ్‌ ఇచ్చింది. నన్ను పంపేయమని లేదా వాడిని కూడా నాతో పాటు బయటికెళ్లమని. మా బాస్‌ పిలిచి నా జీతం కూడా మా ఆవిడ తీసుకెళ్లింది కాబట్టి బుద్ధిగా ఇంటికెళ్లమని సలహా ఇచ్చాడు. మా అమ్మా వాళ్లకి ఫోన్‌ చేస్తే వాళ్లూ నన్నే తిట్టారు. నాకే వేరే దిక్కూ దివాణం లేక చచ్చినట్టు ఇంటికొచ్చా. పాపం చెప్పొద్ద్దూ తాయారు నన్ను చూసి ఏడ్చేసింది. ఏవండీ మళ్లీ ఎక్కడికీ వెళ్లొద్దు, మీరు చెప్పినట్టే వింటాను అని. అది కూడా ఆదివారం వరకే. కథ మళ్లీ మొదటికొచ్చింది. ఛీ ఎదవ బ్రతుకు... అయినా ఆ దేవుడిననాలి మగాడై ఉండి కూడా నన్ను మగాడిగా పుట్టించి ఇన్ని కష్టాలపాలు చేసినందుకు.

ఇట్లు మీ సత్యనారాయణ దీక్షితులు

ఇవి ఇంట్లోనే చేసుకోవచ్చు



క్లీనింగ్ పౌడర్, కొవ్వొత్తులు, హెర్బల్ షాంపూ, వైట్ ఫినాయిల్, వాజ్‍లైన్, లిక్విడ్ సోపు.. వీటన్నింటిని ఇంట్లో కూడా సులువుగా చేసుకోవచ్చు. ఖర్చూ తక్కువవుతుంది. పైపెచ్చు బ్రాండెడ్ ఉత్పత్తులకన్నా శక్తివంతంగా పని చేస్తుంది. ఈ క్లీనింగ్ వస్తువుల తయారి
విధానం ,ముడి సరుకులు దొరికే చోట్లు.
ఈ విషయంపై గత నెల 26 తేది ఆంధ్రజ్యోతి దినపత్రికలోని నవ్య విభాగం లో ప్రచురించబడింది. అవన్నీ తెలుసుకోవాలంటె ఈ బ్లాగులోని నేర్చుకుందాం విభాగంలో చూడండి..

గుడ్ బై

రెండేళ్ళుగా తెలుగు బ్లాగు గుంపులో ఉంటూ, ఒకటి తర్వాత ఒక బ్లాగు మొదలెట్టి ఇప్పటికి కాస్తో కూస్తో మంచి పేరు తెచ్చుకున్నాను. కాని ఈ మధ్య వస్తున్న అనామక దాడి తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. ప్రతి సారి టపా రాయగానే అనామకులతో జాగ్రత్తగా ఉండాల్సొస్తుంది. ఏదో అంటారు, మనమేదో అంటాము. అలా మాట్లాడేవారికి తమ పేరు చిరునామా కూడా ఉండదు . వ్యాఖ్య రాసేటప్పుడు తెచ్చిపెట్టుకున్న ధైర్యం తమ వివరాలు ఇవ్వడానికి ఉండదు. ఈమధ్య ఏవేవో చెత్త మెసెజిలు, ఒక్కోసారి వైరస్ లింకులు కూడా ఇస్తున్నారు వెధవలు.. వీళ్ళను ఎదుర్కోవడమే పనా. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ రోజు నుండి నా బ్లాగులన్నింటిలో పేరు , చిరునామా లేకుండా అనామక వ్యాఖ్యలు రాసేవారికి గుడ్ బై , వీడుకోలు చెప్తున్నా. అలా అని తిక్క వేషాలు వేసినా సహించేది లేదు..

Sunday, 2 March 2008

HAPPY BIRTHDAY SRIDHAR



రాష్ట్రంలో కంప్యూటర్ అక్షరాస్యతా ఉద్యమానికి ఊపిరిపోస్తున్న శ్రీ నల్లమోతు శ్రీధర్ కి జన్మదిన శుభాకాంక్షలు


Send this eCard !

Saturday, 1 March 2008

అమ్మ గురించి ఆలోచించండి



కార్యేషు దాసి
కరణేషు మంత్రి
భోజ్యేషు మాతా
శయనేషు రంభ…

ఇలా ఉండాలని ప్రతి అమ్మాయికి నేర్పిస్తారు. ప్రతి ఆడపిల్ల పెళ్ళికాకముందు హాయిగా చీకుచింతా లేకుండా, చదువు , స్నేహితులతో సరదాగా ఉంటుంది. కాని పెళ్ళీకాగానే తనంతట తానుగా అమ్మలా మారుతుంది. లేదా మారడానికి ప్రయత్నం మొదలు పెడుతుంది. ఒక కుటుంబాన్ని తనదిగా భావించి మరో తరాన్ని సృష్టించి,ముందుకు నడిపించే పెద్దరికం నెత్తిన వేసుకుంటుంది స్త్రీ. అత్తవారింటి కొచ్చాకా కొత్తగా ఆంక్షలు, పద్ధతులు కూడా మొదల్వుతాయి. ఐనా అనుభవం మీద ఒక్కటోక్కటిగా భర్త సహకారంతో నేర్చుకుంటుంది. అత్తమామలకు, భర్త పిల్లలకు కావలసినవి అమర్చి పెట్టడం, బంధువులతో మర్యాదగా ఉండడం ఇలా ఎన్నో బాధ్యతలతో సతమతమవుతుంది. తనకంటు కొన్ని కోరికలు, ఆశలు ఉంటాయని ఎవరైనా ఆలోచిస్తారా? తమకాలనీలో చీరలమ్మేవాడు వస్తే అందరు చీరలుకొనుక్కున్నారు. తను ఉద్యోగం చేయట్లేదు. కాబట్టి స్వతంత్రించి కొనుక్కోలేదు. ఇంటి ఖర్చులకోసం భర్త ఇచ్చిన డబ్బులలొ నుండి కొనుక్కోవచ్చు . కాని అది తన స్వంతం కాదు. ఖర్చు పెడితే దాని లెక్క చెప్పాలి. లేదా భర్తను అడగాలి. అందరికి అన్నీ అమర్చి పెడుతున్నా తనకంటూ స్వంత డబ్బుఉండదు. అది భర్తదో, కొడుకుదో, కూతురిదో అవుతుందిగాని. వాళ్ళు ఇస్తేనే తప్ప తనకిష్టమైనది కొనుక్కోలేదు.ఇంటిపనులనీ చేసి ఉద్యోగం కూడా చేయాలంటే కష్టం.

పెళ్ళై , పిల్లలు వాళ్ళ పెంపకం, చదువులు,ఉద్యోగాలు, పెళ్ళిల్లు ఇలా బాధ్యతలు పెరుతూనే ఉంటాయి. ఈ పరిణామంలో తన ఉనికినే కోల్పోతుంది స్త్రీ. తనకు ఏదిష్టం, ఏది తనకు నిజమైన సంతృప్తి నిస్తుంది అనే విషయాలు. ఎప్పుడూ భర్తకు కావల్సినవి, పిల్లలకునచ్చినవి చేయడం అనే ఆలోచనలే. ఈరోజులో చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు, కుట్లు అల్లికలు మొదలగునవి చేసి తమకంటూ ఆదాయం ఏర్పరచుకుంటున్నారు. కాని అవి కుటుంబ నిర్వహణకు, పిల్లల ఖర్చులకు సరిపోత్తున్నాయి. సరేలే భార్య ఎంత కష్టపడినా కుటుంబ ఆదాయానికే కదా అని భర్తలు ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో మాత్రం ఆమె తన కుటుంబ నిర్వహణలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఊరుకోరు. తమను దాటి పోనివ్వరు భర్తలు. పాతకాలంలో ఆడవాళ్ళని ఎప్పుడు మగాడి వెనకాలే ఉండేలా చేసేవావాళ్ళు, ఇప్పుడు కనీసం తమతో సమానంగా ఉండేలా ఒప్పుకుంటున్నారు కాని తమను దాటి ఒక్కడుగు కూడా ముందుకు పడనివ్వరు . అయినా స్త్రీలు సహనంతో రెండు బాధ్యతలు సమర్ధవంతంగానే నిర్వహించగలుగుతున్నారు. ఎవ్వరిని నొప్పించక తానొవ్వక అన్నట్టు.

నిజంగా అమ్మ చేసే పనులన్నీ మీరు చేయగలరా? ఇక్కడ అమ్మ అంటే ఇంటి ఇల్లాలు. ఒక్కసారి కనీసం మూడు రోజులు అమ్మ స్థానంలోకి వెళ్ళి ఆవిడ చేసే పనులన్నీ మీరు చేయగలరా ప్రయత్నించండి. లేదా కనీసం ఒక్క రోజు. చెప్పడంకాదు. చేయాలి. అలాగే ఉద్యోగం చేస్తూ , ఇంటిపనులు కూడా సమర్ధవంతంగా చేయగలరా అందరు మగవాళ్ళు. మరి అలాంటప్పుడు స్త్రీని ఎందుకు తప్పులు ఎత్తి చూపుతారు? అంటే భార్త్య(అమ్మ ) ఉన్నది ఇంటిపని చేయడానికేనా. పెళ్ళి అయినప్పటినుండి కుటుంబం కోసం ఇంత కష్టపడుతుంది కదా అని ఒక్కసారైనా అనుకున్నారా? లేదు ఆవిడ ఉన్నది ఆ పనులు చేయడానికే అని అనుకుంటున్నారా? పిల్లలకు చేయాలి, మళ్ళీ వాళ్ళ పిల్లలకు కూడా చేయాలి. కాని అవన్నీ తను సంతోషంగా చేస్తుంది.


కాని ఒక్కసారైనా అమ్మకు ఏదంటే ఇష్టం. ఏ స్వీటు అంటే చాలా ఇష్టం. ఏ పుస్తకం చదవాలనుకుంటుందో, ఏదైనా నేర్చుకోవాలనుకుని మానేసిందో తెలుసా. తనకు తెలిసినవాళ్ళెవరికైనా సహాయం చేయాలని చేయలేకపోయిందా. ఆడది కదా ఓ చీరో, ఓ నగో ఇస్తే సంతోషిస్తుందిలే అనుకుంటారు కదా. కాని వాటికంటే ఆమెకు చాలా ఇష్టమైనది ఏదో ఉంటుంది . ఆ పని చేస్తే (డబ్బులు రాకున్నా) ఆమెకు నిజమైన సంతృప్తి కలుగుతుందేమో. ఇప్పటికైనా కనుక్కోండి. అది ఆమెను చేయమని ప్రోత్సహించండి. తల్లిగా, భార్యగా తన బాధ్యతలతో పాటు తనకంటూ ఒక జీవితం , ఒక లక్ష్యం సృష్టించుకోనివ్వండి. అప్పుడు ఇంకా ఉత్సాహంతో ఉంటుంది.



అందుకే ఒక్కసారి అమ్మ గురించి ఆలోచించండి.. " అమ్మా నీకు ఏమిష్టం ? "
నేను చెప్పాలనుకున్న మరి కొన్ని విషయాలు వసుంధర లో చూడండి.


నేటి తరానికీ ఈ టపా నచ్చకపోవచ్చు. ఇది నా తరానికి, నా ముందు తరానికి చెందిన అమ్మలకు చెందిన వాస్తవాలు. ఇలాంటి ప్రాణమిచ్చే అమ్మలు ఎందరికో ఉన్నారు. లేనివాడు కోట్లున్నా బిచ్చగాడే. పైసా లేకున్నా కోటీశ్వరుడే..



ఏమి చేయాలో తెలీని అయోమయంలో ఉన్న నాకు " నీకంటూ ఒక జీవితం సృష్టించుకో. నీకిష్టమైనవి చేయి" అని నా ఆలోచనా విధానాన్ని మార్చిన ఒక ఆత్మీయ స్నేహితునికి మనఃపూర్వక సుమాంజలి.

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008