రగిలే జ్వాలను ఎలా మళ్లిద్దాం? (డిసెంబర్ 2009 కంప్యూటర్ ఎరా ఎడిటోరియల్)
ఏదో సాధించాలన్న తపన మనసు లోతుల్లో జ్వలించకపోతే దేహం నిర్జీవమైపోతుంది. కాంక్ష మనసుకూ, శరీరానికీ జీవశక్తినిస్తుంది. కాంక్షే ఆవిరైపోతే అన్ని శక్తులూ హరించుకుపోతాయి. కొందరి కాంక్షలు సామాజికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించడం చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి. మరికొందరివి ఆధ్యాత్మికత ఉన్నతి, కళారాధన చుట్టూ, ఇంకొందరివి ధన సంపాదన చుట్టూనూ పరిభ్రమిస్తుంటాయి. విలాసాలు, భోగాల పట్ల ఏర్పడే మోహం కొన్ని కాంక్షలను ప్రజ్వలింపజేస్తుంది. భుజించే ఆహారం శక్తినీ.. శక్తి కాంక్షనీ.. కాంక్ష అగ్నినీ రగిలించడం సహజ ప్రక్రియే. అయితే ఆ అగ్నిని ఏ దిశగా నిమగ్నం చేయాలన్నది మన ఇచ్ఛ పైనే ఆధారపడి ఉంటుంది. మనలోని శక్తికేంద్రం నుండి ఉద్భవించే శక్తిని ఏ పనులకై వినియోగిస్తున్నామన్న దాన్నిబట్టే 'ఈ క్షణం మనం' ఉన్నాం. ఎంసెట్ ర్యాంక్ తెచ్చుకోవాలనో, మంచి జాబ్‌లో సెటిల్ అవాలనో, ఆర్థికంగా, సామాజికంగా బాగా స్థిరపడాలనో, జగమెరిగే కళాకారుడిగా మిగిలిపోవాలనో, జీవితాన్ని అపురూపంగా చక్కబెట్టుకోవాలనో.. ఏదో లక్ష్యం నిరంతరం మనల్ని నడిపిస్తూనే ఉంటుంది. లక్ష్యం నిర్దేశించుకోవడం తెలియకపోతే లోపల ఊరకుండని అగ్ని.. కోరికలుగా పరివర్తన చెందుతుంది. ఆ అగ్నికుండే తత్వమే ఏదో ఒక దాన్ని జ్వలింపజేయడం! అది లక్ష్యం కావచ్చు, కోరిక కావచ్చు. దాన్ని లక్ష్యం వైపు మళ్లిస్తే 'భవిష్యత్' ఉన్నతంగా నిర్మితమవుతుంది.. ఆ నిర్మాణ క్రమంలో 'ప్రస్తుతం' కష్టం క్రింద నలిగిపోతుంది. అదే ఆ అగ్నిని కోరికల వైపు మళ్లిస్తే 'ప్రస్తుతం' మైమరచిపోయేలా ఉంటుంది. 'భవిష్యత్' అగమ్యగోచరమవుతుంది.
మనలో జ్వలించే యావత్‌శక్తినీ కేంద్రీకరిస్తే ఎంతటి క్లిష్టమైనదైనా ఇట్టే దాసోహమవుతుంది. అస్పష్టమైన ఆలోచనాసరళి, గమ్యమెరుగని ప్రయాణం మనలోని నిర్ణయాత్మక శక్తిని నిర్వీర్యం చేసి మన శక్తియుక్తులను సద్వినియోగం చేసుకోవడానికి వీల్లేకుండా ప్రతిబంధకమవుతాయి. ఆ ఊగిసలాటలో మనలోని అపరిమితమైన శక్తీ.. లక్ష్యం కన్పించక, అసంతృప్తితో మనవైపే వెనక్కి మళ్లింపబడుతుంది. మనం మన లోలోపల జరిగే ఆ తతంగం గ్రహించలేక పర్యవసానంగా తలెత్తే భావావేశాలను, అసంతృప్తులను మనల్ని మరింత కుంగదీసుకోవడానికి ఉపయోగిస్తుంటాం. మనలో ఏదైనా శూన్యత, అసంతృప్తి ఏర్పడితే దాన్ని వెంటనే గుర్తించి వీలైనంత త్వరగా చక్కని లక్ష్యాన్ని నిర్దేశించుకోకపోతే మానసికంగా వ్యాకులత ఆవరిస్తుంది. జ్వాల రగిలినంతకాలం దానికి లక్ష్యాలో, కోరికలో.. ఆ రెండూ లేకపోతే ఆలోచనలో ఆహుతి కావలసిందే. ఆ స్థాయిలన్నింటినీ అధిగమించి అదే జ్వాలతో మనసులో నిర్మలత్వాన్ని ప్రసరింపజేసుకోగలిగేలా స్థితప్రజ్ఞులం అవగలిగితే అంతకన్నా కావలసిందేదీ లేదు. ముఖ్యంగా గుడ్డిగా బతుకుబండిని నడిపించడం కాకుండా ఏదో ఒక క్షణం అంతర్ముఖులమై ఇటువంటి అంతరంగ సూక్ష్మాలను గ్రహించగలిగినా మెలమెల్లగానైనా మనల్ని ఔన్నత్యం వైపు కార్యోన్ముఖులను చేసుకోగలం!
మీ నల్లమోతు శ్రీధర్